హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నామని, ఇందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 10 గంటలకే గేట్లు మూసివేస్తామని వెల్లడించింది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎట్టి పరిస్థితులో అనుమతించబోమనిసూచించింది. ఇందుకు మార్గదర్శకాలను బుధవారం టీఎస్పీఎస్సీ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. జూన్ 1నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్టికెట్లు ఉంచుతామని తెలిపారు.