హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న విడుదలైన కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్‌పై అనుమానాలున్నాయని తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని ప్రభుత్వం,టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే న్యాయ పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
పాత నోటిఫికేషన్ రద్దు ఎందుకు ?
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి 2022లో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్తగా 60 పోస్టులు కలిపి 563 పోస్టులతో ఫిబ్రవరి 19 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్లోనే పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది కదా! అని నిరుద్యోగులు సందేహం వ్యక్తంచేస్తున్నారు.
జీవో 55ని ఎందుకు మార్చారు?
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం జీఏడీ సర్వీసెస్-ఏ విడుదల చేసిన జీవో 55ని ఎందుకు రద్దు చేశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ జీవోలో పేర్కొన్నట్టుగా గ్రూప్-1 నోటిఫికేషన్లో కమ్యూనిటీవారీగా కేటాయించిన పోస్టుల వారీగా 1:50 నిష్పత్తిని పాటిస్తూ మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉన్నది. దీనివల్ల జనరల్ క్యాటగిరీ అభ్యర్థులతోపాటు రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ జీవో-55 స్థానంలో జీవో-29 తీసుకొచ్చారు. జీవో-29 ప్రకారం గ్రూప్-1లో ఉన్న మొత్తం పోస్టులను కలిపి 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. యూపీఎస్సీలో ప్రిలిమిరీ పరీక్షలో కమ్యూనిటీ పోస్టుల వారీగా అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. అలాంటిది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎందుకు ఎంపిక చేయలేదు? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
‘షార్ట్‌ఫాల్’ విధానం ఎందుకు?
గ్రూప్-1 నోటిఫికేషన్లో చేసిన మార్పుల ప్రకారం మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపికలో కొత్తగా ‘షార్ట్‌ఫాల్’ విధానం అమలుచేశారు. రిజర్వేషన్ల వారీగా కాకుండా మెరిట్ విధానాన్ని పాటించారు. 563 పోస్టుల కోసం 28,150 మందిని తొలుత ఎంపిక చేశారు. ఆ జాబితాలో కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో కాకుండా తక్కువమంది వచ్చారు. ఈ తక్కువ బడిన రిజర్వేషన్ అభ్యర్థులను ‘షార్ట్‌ఫాల్’ విధానంలో, ఆ తర్వాత ఉన్న మెరిట్‌తో అదే కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా చేయడం వల్ల అదనంగా 3,232 మంది అభ్యర్థులు అంటే 1:57 నిష్పత్తి పాటించినట్టు అయింది. ఈ షార్ట్‌ఫాల్ విధానం వల్ల పెరిగిన 3,232 అభ్యర్థులు ఏ కమ్యూనిటీకి చెందినవారు? దీనివల్ల ఎవరికి లాభం జరిగిందో, ఎవరికి నష్టం జరిగిందో వెల్లడించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
రెండు రోజుల్లో లక్షల దరఖాస్తులా..?
గ్రూప్-1 దరఖాస్తుకు మార్చి 14 వరకు గడువు విధించారు. ఆ గడువు నాటికి 2.70 లక్షల మంది దరఖాస్తులు చేశారు. మార్చి 16 వరకు గడువు పొడిగిస్తే..రెండు రోజుల్లోనే అదనంగా 1.33 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఏం జరిగిందనే అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తంచేస్తున్నారు.
పాత నోటిఫికేషన్లో పాస్.. కొత్త నోటిఫికేషన్లో ఫెయిల్!
పాత గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు.. కొత్తగా గ్రూప్-1 ప్రకారం నిర్వహించిన పరీక్షలో ఎందుకు అర్హత సాధించలేక పోయారు? అనే సందేహాన్ని నిరుద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. లక్షల వెచ్చించి తీసుకున్న కోచింగ్‌లు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత నోటిఫికేషన్లో బాగా చదివినవారు కొత్త నోటిఫికేషన్లో చదువలేక పోయారా? లేక ఫలితాలు విడుదలలో ఏమైనా గందరగోళం జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్ కోసం 1:100 ఎందుకు అమలు చేయరు?
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్-1 మెయిన్ కోసం 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తుందని ఆశ పడ్డామని, ఇప్పుడు నిరాశే మిగిలిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. 1:100 నిష్పత్తి పాటించి తీరాల్సిందే అని డిమాండ్ చేశారని గుర్తుచేస్తున్నారు. 1:100 నిష్పత్తి పాటించక పోవడంలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఫలితాల విడుదల్లో పారదర్శకత లోపించిందని, దీనిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ నిరుద్యోగ యువత స్పష్టం చేస్తున్నది.