KTR | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం కలగదు.. వారికి భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గ్రూప్-1 రిక్రూట్మెంట్లో తప్పు ఎక్కడ జరిగింది, రీవాల్యుయేషన్లో ఇంత పెద్ద మిస్టేక్స్ ఎలా జరిగాయో, ఈ పోస్టులను ఎవరు అమ్ముకున్నారో బయటకు రావాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, లేదంటే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలి. భవిష్యత్లో ఇలాంటివి జరగొద్దంటే జ్యుడిషియల్ కమిషన్ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని కేటీఆర్ అన్నారు. నంది నగర్లోని తన నివాసంలో నిరుద్యోగ అభ్యర్థులతో సమావేశం అనంతరం వారితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలోని నిరుద్యోగ యువత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధి నాయకత్వం, రాహుల్ గాంధీ చెప్పిన మాటలను విశ్వసించి ఆ పార్టీకి ఓటేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాడు చెప్పింది. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ అంటూ అశోక్ నగర్ దాకా వచ్చి నమ్మబలికే విధంగా వాగ్దానం ఇచ్చారు. వారి మాటలను నమ్మి కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలనే సంకల్పంతో ఇవాళ ఇక్కడున్న వారంతా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మమ్మల్ని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారు. వారంతా కూడా రాహుల్ గాంధీ మాటలను నమ్మారు. 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా తలరాతలు మారుతాయి.. మా బతుకులు మారుతాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అందర్నీ మెప్పించి ఒప్పించి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలిచే దాంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నిరుద్యోగ యువత వీరు. కానీ వారి ఆశలను ఆడియాశలను చేస్తూ.. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు. ఈ శతాబ్దపు అది పెద్ద మోసం అయి ఉంటుంది 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రూప్ -1 రిక్రూట్మెంట్లో భాగంగా 500 ఉద్యోగాలకు కేసీఆర్ నోటిఫికేన్ ఇస్తే కాంగ్రెస్ దాన్ని రద్దు చేసి అదనంగా 63 పోస్టులు జోడించి.. అంటే 563 ఉద్యోగాలకు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టారు. కేసీఆర్ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్ష లీకైందని నిఘా వ్యవస్థ ద్వారా సమాచారం రాగానే.. సీఎంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుని.. సరిదిద్దాలనే ఉద్దేశంతో ఆ పరీక్షను రద్దు చేశారు. కానీ ఈ ప్రభుత్వం 563 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించగా అవకతవకలు జరిగాయి. కేసీఆర్ ఇచ్చిన జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 ద్వారా అన్యాయం జరుగుతుంది.. దయచేసి సవరించండి అంటే సవరించ లేదు.. పెడచెవిన పెట్టారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇక ఎగ్జామ్స్ ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అక్రోషించినా పట్టించుకోలేదు. కొన్ని సెంటర్లలో ఉన్నవారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, వరుసగా రూల్ నంబర్లు ఉన్నావారికి ఎక్కువ మార్కులు వచ్చాయని కుంభకోణం జరిగిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆధారాలతో ఆరోపించారు. ఉద్యోగాలను అమ్ముకున్నారని సవరించండి అని ప్రభుత్వం వద్దకు వెళ్లినా న్యాయం జరగేలదు. చివరకు విధిలేక కోర్టును ఆశ్రయిస్తే ఇవాళ శుభవార్త చెప్పింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో లోటు పాట్లు జరిగాయని.. రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలకు వెళ్లాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భేషజాలకు వెళ్ళి, విద్యార్థుల జీవితాలను ఆగం చేయకండి. విద్యార్థుల కష్టంతో మీరు గద్దెనెక్కి కూర్చున్నారు కాబట్టి వారికి రాజకీయ రంగు పూలమకుండా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.