హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కోరారు. అభ్యర్థులే రీ షెడ్యూల్ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతున్నదని ప్రశ్నించారు.
పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలంటూ అశోక్‌నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలంటూ పోరాటం చేస్తున్న అభ్యర్థులు గురువారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తమకు అండగా నిలవాలంటూ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు ఎక్స్ వేదికగా కేటీఆర్‌ను కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. జీవో నంబర్-29 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని, రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని వివరించారు. గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
తాము సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు కచ్చితంగా ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తుందని, రద్దయ్యే ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని చెప్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతున్నదని వాపోయారు. న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అభ్యర్థుల అభిప్రాయాలను సావధానంగా విన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షంగా గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయసాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
జీవో- 29 వెనక్కి తీసుకున్నాకే పరీక్ష
ప్రభుత్వం జీవో-29ను వెనక్కి తీసుకున్న తరువాతే పరీక్ష నిర్వహించాలి. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధం. కేసులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిహిస్తున్నది. కేసులు అన్నీ పూర్తయ్యాకే మెయిన్స్ పరీక్ష పెట్టాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా ప్రామాణికం అని టీజీపీఎస్సీ చెప్తున్నది. ఇదేం పద్ధతో అర్థం కావడం లేదు. మేం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరాం. పూర్తి అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. న్యాయపరంగా కూడా తగిన సాయం అందిస్తామని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని అభయమిచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు.
-మహేంద్ర, గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థి
గాంధీభవన్‌కు పిలిచి అరెస్టుచేస్తారా?
మా సమస్యలను పరిష్కరించాలని కోరితే గాంధీభవన్‌కు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లిన వారిని అరెస్టు చేశారు. సమస్యలు పరిష్కరించమంటే అరె స్టు చేస్తరా? హైకోర్టులో ఉన్న 22 కేసులు పూర్తి కాకముందే మెయిన్స్ పరీక్ష పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. న్యాయపరమైన అంశాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే పరీక్ష రద్దయ్యే అవకాశం ఉన్నది. ప్రభు త్వం ఇప్పటికైనా ఆలోచించాలి. మాకు పూర్తి న్యా యం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. కేసుల న్నీ తేలాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి.
-సింధు, గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థి
మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు
న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నది. ఒక కోర్టులో రాష్ర్టానికి ఒక న్యాయం. మరో రాష్ర్టానికి మరో న్యాయం ఉండదు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మా న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించండి. మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు.
-నర్సింహ, గ్రూప్-1 అభ్యర్థి
బలి చక్రవర్తిలా రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అనేక విధాలుగా సాయం చేశాం. కానీ, అన్నింటినీ విస్మరించి మా గుండెలపై తన్నుతున్నరు. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అన్నడు. నేడు మా భవిష్యత్తును బలిచక్రవర్తిలా బలిపెడుతున్నడు. 40 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల తల్లులను బాధపెడుతున్నరు. ఆ తల్లుల ఉసురు తగలకమానదు.
-రఘురాథోడ్, గ్రూప్-1 అభ్యర్థి