Group 1 Candidate | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ‘ఇది జీవితంలో ఆఖరి అవకాశం మళ్లీ రాదన్నా.. అవకాశం పోతున్నదని ప్రాణం పోతున్నది.. ఇక నాకు చావే దిక్కు’ అని ఓ గ్రూప్-1 అభ్యర్థి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెక్రటేరియట్ వద్ద సొమ్మసిల్లి పడిపోయిన ఆ అభ్యర్థిని మీడియా ప్రతినిధులు, పోలీసులు తేరుకునేలా చేశారు.
రెండేండ్లుగా కష్టపడుతున్నా, పదేండ్ల తర్వాత వచ్చిన అవకాశం, ఇట్లొచ్చి, అట్ల పోతున్నదని బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ బతుకులు ఇంతే, చచ్చిపోతా.. అంటూ బాధను వ్యక్తం చేశాడు. నమ్మి ఓటేసి గెలిపిస్తే కుక్కలు చింపిన విస్తరిలా చేశారని చెప్పాడు. మరో అభ్యర్థి మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లతో గెలిచి, సీఎం అయిన రేవంత్‌రెడ్డికి గ్రూప్-1 అధికారులు కావాల్సిన అభ్యర్థులు రోడ్డెక్కితే కనికరం లేదా? అని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చిన విషయం మరిచిపోయావా? అంటూ మండిపడ్డారు.