Farmers | రామారెడ్డి, మార్చి 4 : వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు సోదరులు భగీరథ ప్రయత్నం చేసినా ఫలించలేదు. పాతాళానికి చేరిన గంగమ్మను భువిపైకి తెచ్చేందుకు ఒక్కరోజే నాలుగు బోర్లు వేసినా చుక్క నీటి జాడ దొరకలేదు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఎకరానికి దాదాపు రూ.25 వేల
దాకా పెట్టుబడి పెట్టి నాట్లు వేశారు.
బోర్లు ఎత్తిపోవడంతో పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోయే దుస్థితికి చేరుకున్నది. ఇదే మండలంలోని పోసానిపేట్కు చెందిన అన్నదమ్ములు కామటి గంగయ్య, భూమయ్యకు రెండెకరాల పొలం ఉన్నది.వేసిన వరి పంట నీళ్లులేక ఎండిపోతుండడంతో పంటను కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకంగా నాలుగు బోర్లు తవ్వించారు. సుమారు రూ.లక్షా 50 వేలతో బోర్లు వేయించినా చుక్కానీరు రాలేదు. 200 ఫీట్లకు పైగా బోరు తవ్వినా నీటి జాడ కనిపించలేదు. దీంతో రైతు సోదరులు బోరున విలపించారు. పెట్టుబడితోపాటు పంట ఎండిపోయి అప్పులు పాలు కావాల్సి వచ్చిందంటూ రోదించారు. పదేండ్లలో ఎన్నడూ పంట ఎండిపోలేదని, ఇదే మొదటిసారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు పోసానిపేట రైతుల ఆవేదన అద్దం పడుతున్నది.
నాకో ఎకరం, మా అన్న భూమయ్యకో ఎకరం ఉన్నది. యాసంగిలో రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసినం. వారం నుంచి పొలం ఎండుతున్నది. మా పొలం నుంచి కాలువ ఉన్నా చుక్కా నీరు రావడంలేదు. ఉన్న పాతబోరు ఎత్తిపోయింది. మంగళవారం నాలుగు బోర్లు వేయించనా ఒక్క దాంట్లో కూడా నీళ్లు పడలేదు. చివరికి అప్పుల పాలైనం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏటా రెండు పంటలు పండించినం. ఇప్పుడు పంట పొట్ట దశలోనే ఎండిపోతున్నది. మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలె.
– కామటి గంగాధర్, రైతు