Ground Water | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదేండ్ల పాటు ఉబికివచ్చిన భూగర్భజలాలు ఏడాదిన్నరగా మరింత లోతుకు పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉన్న జలాలు మార్చి నాటికే 9.91 మీటర్ల దిగవకు పడిపోయాయి. మూడు నెలల్లో దాదాపు మూడు మీటర్ల దిగువకు గ్రౌండ్‌వాటర్ పడిపోయింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో చేతి పంపులకు నీళ్లు అందటంలేదు.
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ప్రజలకు తాగునీరు అందించే సింగిల్ ఫేస్ మోటార్లు, త్రిఫేస్ మోటార్లకు పూర్తిస్థాయి నీరు అందడంలేదు. ఎండలు మరింత తీవ్రమైన తర్వాత పరిస్థితి ఇంకా జటిలంగా మారనున్నదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. మే నాటికి పరిస్థితి మరింత దిగజారనున్నట్టు భూగర్భజలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2014-15 నుంచి 2023-24 వరకు గ్రౌండ్ వాటర్ 30 శాతం మేరకు మెరుగైంది. 3.29 మీటర్ల మేరకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. కానీ నిరుడు మార్చితో పోలిస్తే ఈ మార్చిలో సగటు 0.22 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది.
2015-2024 మార్చి దశాబ్ద సగటుతో పోలిస్తే మొత్తం 612 మండలాల్లోని 317 మండలాల్లో నీటి మట్టాల్లో పెరుగుదల (0 నుంచి 29.59 మీ.) కనిపించింది. 295 మండలాల్లో నీటి మట్టాల్లో తగ్గుదల (0.02 నుంచి 32.91 మీ.) కనిపించింది. నీటి మట్టాల్లో 2 మీటర్ల కంటే ఎకువ పెరుగుదల ఎకువగా నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నమోదైంది. రెండు మీటర్ల కంటే ఎకువ తగ్గుదల ఉన్న మండలాలు 74కి పైగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లో ఉన్నాయి.
ప్రకృతి సిద్ధంగా పడే వాన నీటి నుంచి పది శాతం కూడా మనం ఒడిసి పట్టుకోలేకపోతున్నాం. రాష్ట్రంలో ఈసారి అధిక వర్షపాతం నమోదైనా ఆ వరద భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. విచ్చలవిడిగా బోర్లు తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావడం వల్ల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుకోలేకపోతున్నాం. 40 శాతం మేరకు వర్షపు నీరు సముద్రం పాలవుతున్నది. మరో 40 శాతం మేర నీటి ఆవిరి రూపంలో వెళ్తున్నది. తొమ్మిది శాతం మాత్రమే భూగర్భంలో ఇంకుతున్నది. మిగతా 11 శాతం జలాల నిల్వకు అవకాశం ఉన్నది. కనీసం 20 శాతం జలాలు అయినా ఒడిసిపట్టుకుంటే నీటి కరువు అనేది మనకు ఉండనే ఉండదు.
– కే లక్ష్మ, భూగర్భ జలశాఖ డైరెక్టర్
భూగర్భజల విభాగం వాడిన ఫైజోమీటర్లు 1,771
సాధారణ వర్షపాతం కంటే ఎంత ఎక్కువ 21%
మార్చి 31 వరకు సగటు వర్షపాతం 76 మి.మీ
మార్చి 31 నాటికి నమోదైన వర్షపాతం 1,056 మి.మీ
యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిష్టం 785 మి.మీ
ములుగు జిల్లాలో గరిష్ఠం 1,656 మి.మీ.
సాధారణం కంటే అధిక వర్షపాతం 13 జిల్లాలు (20%-69%)
సాధారణ వర్షపాతం20 జిల్లాలు (0%-19%)
మార్చిలో సగటు భూగర్భ జల మట్టం 9.91 మీటర్లు
అత్యల్పంగా భూగర్భజల మట్టం జగిత్యాల జిల్లా(5.24 మీటర్లు)
అత్యధికంగా భూగర్భజల మట్టం మెదక్ జిల్లా (15.72 మీటర్లు)లోతున