పెద్దపల్లి, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో ఒక వైపు బోర్లు ఎత్తిపోతుండగా.. మరో వైపు బావుల్లో నీరు అడుగంటి పోతున్నాయి. దీంతో సాగు కష్టాల్లో, ఆర్థిక నష్టాల్లో రైతులు కూరుకుపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దపల్లి జిల్లాపై కుండగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్కనీరు లేకపోవడంతో బోర్లు, బావులు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు తిరిగి బోర్లు వేసుకోవడం, బావులను పూడిక తీయడం లాంటి పనులను చేపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
తలాపున పారుతున్న గోదావరి నీ సేను నీ సెలుక ఎడారి అని స్థానిక కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు మూడు దశాబ్ధాల క్రితం తెలంగాణ సాగు నీటి కష్టాలను ఏకరువు పెట్టగా పదేళ్ల తర్వాత తిరిగి అదే పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్ పాలన వచ్చింది కష్టాలను వెంట బెట్టుకొని వచ్చిందనే విధంగా పాలన సాగుతుండటంతో రైతుల్లో అసహనం వ్యక్తం అవుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం మండలాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో భూగర్భజలాలు 5.47మీటర్ల లోతులో ఉండగా 2024ఫిబ్రవరి మాసంలో 5.09మీటర్ల లోతులో, 2025ఫిబ్రవరి మాసంలో 5.44మీటర్ల లోతులోకి పడిపోయాయి. బీఆర్ఎస్ పార్టీతో కక్షతో కాళేశ్వరంను పక్కన పెట్టి తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మోటార్లతో పని లేకుండానే కాలువల్లో సాగు నీరు పారిందని, కాళేశ్వరం గేట్లు ఎత్తడంతో బోర్లన్నీ ఎత్తిపోయి బోర్లల్లో కూడా చుక్క నీరు రావడం లేదని మూడేళ్ల దాకా ఇక సాగు అంతేనా..? అలాగైతే తాము ఎలా బ్రతుకుతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంథని గోదావరి నదిలో నీళ్లు లేవని మంథని మండలం కాకర్లపల్లికి చెందిన ఆకుల సాయికుమార్ చెప్పారు.. గతంలో ప్రాజెక్టుల నీళ్లుంటే ఇక్కడ మాకు నీళ్లు మిదకచ్చేది. కానీ ఆ నీళ్లను వదిలిపెట్టిన్లు. సరే అని బోర్లకిందనన్న సాగు చేసుకుందామంటే ఆ బోర్లల్ల కూడా నీళ్లుంటలెవ్వు. మునుపు కాళేశ్వరం ప్రాజెక్టుతోటి మాకు కాలువలల్ల నీళ్లు అ పక్కన గోదావరిలో నీళ్లు ఉండుటుతోటి బోర్లళ్ల కూడా పుష్కలంగా నీళ్లుండేది. కరెంటు కూడా పుష్కలంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కరువే వచ్చింది. బోర్లళ్ల నీళ్లు లెవ్వు. సర్కారు మమ్ముల ఆదుకోవాలే. మాకో దారి చూపాలని విజ్ఞప్తి చేశారు.
మునుపెప్పుడు ఇంతగనం నీళ్లు దిగిపోలేదని, ఈ ఏడే పరిస్థితి ఇలాగుందని అంతర్గాం మండలంలోని ఇసంపేటకు చెందిన బర్పటి శ్రీనివాస్ అన్నారు. పంటకు నీళ్లు సరిపోతలెవ్వు. అందుకే క్రేన్ పెట్టి లోతు తీపిస్తున్న. నీళ్లు సరిపోక ఇప్పుడు లోతు తీపిస్తున్న దీనికి ఇప్పుడు 50వేల ఖర్చవుతున్నది. ఇన్నేండ్లు లేని బాధ ఇప్పుడు పడాల్సి వస్తున్నది. రైతుల బాధలు ఇట్లనే ఉంటయ్. ఇప్పుడు లోతు తీపియ్యకుంటే నా పంటే నాశనం అవుతది. మూడెకరాల పంట దెబ్బతింటది. అందుకే తోడిస్తున్న.