హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నలు కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా, గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించినంత మెరుగ్గా ఏమీ లేదు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలవగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో యాసంగిసాగు కష్టంగానే కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, బోరుబావుల కింద కూడా సాగు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టే కీలకం
చెరువులను నింపడంలో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టే కీలక భూమికను పోషించింది. 2019లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ రావడమేగాక, వాటికింద ఉన్న చెరువులను కూడా గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నీటితో నింపింది.
వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. ఖమ్మం జిల్లాలోనూ సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలతో లింకు కలిపి ఏడాది పొడవునా నింపుతూ వచ్చారు. ఒక్కమాట చెప్పాలంటే తెలంగాణ మూలమూలకు గోదావరి జలాలను కేసీఆర్ సర్కారు తరలించింది. ఫలితంగానే సాగు విస్తీర్ణంలో తెలంగాణ రికార్డు నమోదు చేసింది. చెరువులను, చెక్‌డ్యామ్‌లను క్రమం తప్పకుండా నింపడం వల్లనే భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగానే 30 లక్షల బోర్ల కింద ఎవుసం ఇప్పటివరకు పండుగలా సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పంటలకు భరోసా ఇచ్చింది.
ఇప్పటికే 1.47 శాతం తగ్గిన భూగర్భజలాలు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నాటికి 852 మిల్లీమిటర్ల సాధారణ వర్షపాతానికి గాను 914 మిల్లిమీటర్లు నమోదయింది. ఇది సాధారణంకంటే 7 శాతం అధికం. అయినప్పటికీ గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 1.47 శాతం మేరకు భూగర్భజలాలు ఇప్పటికే తగ్గిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత లోతుకు పోయే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం సగటు భూగర్భ జలమట్టం 6.80 మీటర్లు ఉన్నది.
గత ఏడాది ఇదే సమయంలో 30 జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 0.32 నుంచి 4.60 మీటర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం 7 జిల్లాలో మాత్రమే 5 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భజలాలు ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 5-10 మీటర్ల లోతుకు పడిపోయాయి. అందుకు ప్రధాన కారణంగా చెరువులను నింపకపోవడమేనని నిపుణులు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భజల మట్టం పడిపోకుండా ఉన్నదని చెప్తున్నారు.
చెరువులపై దృష్టి పెట్టని కాంగ్రెస్ సర్కారు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను నింపడంపై ఇప్పటికీ దృష్టి సారించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనేదానిపై చూపెట్టిన ఉత్సాహాన్ని చెరువులపై పెట్టలేదు. మేడిగడ్డలోని లక్ష్మీబరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపలేదు. బరాజ్ కుంగుబాటు ఘటనను భూతద్ధంలో చూపేందుకు ఎలాంటి ఆలోచన చేయకుండా నీళ్లను దిగువకు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పుడు బరాజ్‌లను ఖాళీ చేసింది. ఇక ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీ, మల్లన్నసాగర, కొండపోచమ్మసాగర్‌లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉన్నా కూడా ఇప్పటికీ చెరువులను నింపడం లేదు. ప్రధాన కాలువల ద్వారా మాత్రమే కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లను ఇస్తున్నది. దీంతో ఆయా చెరువుల కింద రెండో పంట సాగు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.