హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అవి నిర్వీర్యమవుతున్నాయా? అంటే ఇటీవల జరిగిన రెండు ఉదంతాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. షాబాద్‌లో ఒకేరాత్రి ఆరుగురిని హత్యచేసిన కిరాతకం, బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు పరిణామాల వెనుక పోలీసుల వైఫల్యాలు కన్పిస్తున్నాయి. ప్రశ్నించడం ఆగిపోతే పోలీసులు కేసులు అక్కడే సెటిల్ చేస్తారనే విమర్శలను ఈ రెండు కేసులు నిజం చేస్తున్నాయి. బండి భగీరథ్ కేసులో సమాజం ప్రశ్నించకుంటే స్టేషన్ బెయిల్‌తోనే నిందితుడు బయట తిరిగేవాడని ప్రజలు చర్చించుకొంటున్నారు.
ఒత్తిళ్లతోనే బండి కేసులో కదలిక
బండి భగీరథ్‌పై మే 7న రాత్రి బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. పేట్‌బషీర్‌బాగ్ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికే హైడ్రామా చేశారు. బాధితులు ఫిర్యాదు ఇస్తున్నారనే విషయాన్ని నిందితుల తరఫువారికి సమాచారం ఇచ్చారు. దాంతో కరీంనగర్లో వారి పలుకుబడితో బాధితురాలిపైనే ఫేక్ కేసు నమోదు చేయించారు. బాధితులు న్యాయం కావాలంటూ పోలీసులను ప్రశ్నించడంతో ఆ రోజు రాత్రి బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద (74, 75 అఫ్ బీఎన్ఎస్ సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో 2012) కేసు నమోదు చేశారు. నిందితుడు రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందని సోషల్‌మీడియా, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆమె ఈ కేసులో లోతైన దర్యాప్తు నిర్వహించారు. దీంతో కొత్తగా 5(1), రెడ్ విత్ 6 పోక్సో యాక్ట్ 2012 మేరకు నేరం రుజువైతే నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్న సెక్షన్లను మార్చారు. ఇక్కడ ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నించడంతోనే దర్యాప్తునకు ప్రత్యేక అధికారిని నియమించగా సెక్షన్లను మార్చారు.