PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకూ పడిపోతున్నదంటూ ఇటీవల కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని తాజాగా తేల్చి చెప్పింది. మోదీ హయాంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం, మండిపోతున్న ధరలపై సామాన్యుల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్న చాట్‌బాట్.. ఈ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే 2029 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు గ్రోక్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
ప్రశ్న: దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఏమిటి?
గ్రోక్: నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ప్రస్తుతం దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం కూడా ప్రధాన సమస్యగానే ఉన్నది.
ప్రశ్న: మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఏ మేరకు పెరిగాయి?
గ్రోక్: మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి 2025 నాటికి నిత్యావసరాల ధరలు సంవత్సరానికి సగటున 5 నుంచి 10 శాతం మేర పెరిగాయి. ఈ లెక్కన ఒక్కో వస్తువు ధర ఈ పదకొండేండ్లలో 55 శాతం నుంచి 110 శాతం మేర పెరిగినట్టు అర్థం చేసుకోవచ్చు.
ప్రశ్న: నిరుద్యోగ సమస్యను తీర్చడంలో, ధరలను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందా?
గ్రోక్: 2014 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య పెచ్చరిల్లిపోయింది. ఏడాదికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల హామీ అటకెక్కింది. ధరలు మండిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపించడంలో మోదీప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు.
ప్రశ్న: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఏ ప్రధాని ఎక్కువగా ఫెయిల్ అయ్యారు?
గ్రోక్: నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలను జమ చేస్తానని ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ హామీనిచ్చారు. అలాగే ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానాలు చేశారు. అయితే, ఇవన్నీ అమలు కాలేదు. దీన్నిబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో నరేంద్రమోదీ ఎక్కువగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు.
ప్రశ్న: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోదీని దేశ ప్రజలు నాలుగోసారి ప్రధానిగా అంగీకరిస్తారా?
గ్రోక్: ఉద్యోగాల కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. దీనికి తోడు నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, రైతుల సమస్యలను పరిష్కరించడం వంటి సవాళ్లు అలాగే ఉన్నాయి. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వీటి ప్రభావం కీలకంగా మారడంతో గతంతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 63 సీట్లను కోల్పోయి 240 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. మెజారిటీ మార్కు 272 కంటే ఇది చాలా తక్కువ. ఈ ఫలితాలు ప్రజల్లో బీజేపీ, మోదీ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. వచ్చే దఫా ఎన్నికల నాటికి నిరుద్యోగం, ధరలు, రైతు సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం ఇప్పటిలాగే విఫలమైతే, ఆ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి కష్టమే కావొచ్చు. 2029నాటికి మోదీ వయసు 79 ఏండ్లు దాటడం కూడా బీజేపీ గెలుపునకు ఒక అవరోధంగా మారొచ్చు కూడా.