GRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లోని మెంబర్ సెక్రటరీ అళగేశన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. మహిళా అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను తెలుసుకొని.. మీటింగుల్లో బహిర్గతం చేశారని తెలిసింది. మహిళా ఉద్యోగుల వస్త్రధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, పని ఉందని పిలిచి తన చాంబర్లో గంటలకొద్దీ కూర్చోబెట్టుకునేవారని పలువురు ఆరోపిస్తున్నారు. వారాంతాల్లో ఇంటికి లంచ్ లేదా డిన్నర్‌కు పిలవాలని మహిళా ఉద్యోగులకు చెప్పేవారని అంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్తున్నారు. ఆయనపై ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా వచ్చాయని, కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. లైంగిక వేధింపులపై గత ఏడాది మహిళా ఉద్యోగులు చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు.
అళగేశన్ మహిళలను వేధించడమే కాకుండా ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడ్డారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సు తీసుకుంటూనే.. ప్రభుత్వ వాహనాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. చైర్మన్ అనుమతి లేకుండానే ఇటీవల బెంగళూరు ట్రిప్పు లో ఆటో, కారు చార్జీల రూపంలో రూ.13 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కంటి సర్జరీ కాకుండానే అయినట్టు చెప్పి లెన్స్ కోసం రూ.21 వేలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి సంబంధించిన అధికారులకు నిర్వహించిన క్లాసులకు ఒకో దానికి రూ.10 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెకల ప్రకారం కాకుండా.. కేంద్ర ప్రభుత్వ వ్యయాలను ప్రస్తావిస్తూ బిల్లులు డ్రా చేశారని అంటున్నారు. జలసౌధలో ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. మళ్లీ ప్రత్యేకంగా జీఆర్ఎంబీ కోసం సెక్యూరిటీ సిబ్బందిని నియమించి ఖర్చులు అధికంగా చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనపై ఫిర్యాదు చేసిన బోర్డు ఉద్యోగులకు అళగేశన్ మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే సీడబ్ల్యూసీ చైర్మన్, కేంద్ర జలశక్తి శాఖకు ఈఎన్సీ జనరల్ ఫిర్యాదు చేశారు. జీఆర్ఎంబీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ అసోసియేషన్స్ ఆయనపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయనను తప్పించాలని వారు కోరుతున్నారు.