ఆదిబట్ల, మే 7 : ‘గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు మాకొద్దు. దానివల్ల మాకేం లాభం లేదు. అంతా ఉన్నోళ్లకు లాభం. మా భూములు పోవడం తప్ప మాకెందుకు ఉపయోగపడదు’ అని రేడియల్ రోడ్డు భూబాధితులు అధికారులను నిలదీశారు. ముందస్తు సమాచారం లేకుండా గ్రామ సభను నిర్వహించడంపై మండిపడ్డారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో కొంగరఖుర్ధు రెవెన్యూలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారి రాజు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు అధికారుల ను నిలదీశారు. ‘బతుకుదెరువు పోయి మేము రోడ్డున పడుతుంటే పోలీసుల అండతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి భూములు గుంజుకొంటారా?’ అని ప్రశ్నించారు.
రేడియల్ రోడ్డులో ఎన్ని ఎకరాలు పోతున్నాయి? ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారో తమకు సమాచారం లేదని అన్నారు. రాత్రి అందరు నిద్రపోయిన తరువాత చాటింపు వేయించి తెల్లవారే సరికి ఎవ్వరికి సమాచారం లేకుండానే గ్రామసభలు నిర్వహించడం ఏంటని భూసేకరణ అధికారిని నిలదీశారు. ఒకే సర్వే నంబర్లో రెండుసార్లు ప్రభుత్వం భూమిని సేకరించడం ఏంటని మండిపడ్డారు. భూముల వద్ద పోలీసులు పహారా కాసి తమను రానియ్యడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక భూసేకరణ అధికారి రాజు అయోమయానికి గురయ్యాడు. దాదాపు 30మంది రైతులు గ్రామ సభను బహిష్కరిస్తూ తీర్మానం చేసిన కాపీని భూ సేకరణ అధికారికి అందచేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న కొంతమందితో సభను కొనసాగించారు.
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు టైటిల్ డీడ్ ఉంటే పరిహారం అందుతుందని, కబ్జాలో ఉంటే రాదని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గ్రామ సభలో మాట్లాడుతూ.. రోడ్డు ఏర్పాటులో వందశాతం భూమి కోల్పోతే దానిపైనే ఆధారపడి జీవిస్తున్న రైతుల కుటుంబంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.5.5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. భూములకు ఎంత ధర చెల్లించాలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పటికే 42మంది రైతులకు చెందిన 54 ఎకరాల 33 గుంటల భూమిని సేకరించడం జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు.