హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఎదుటివారిని వేలెత్తి చూపినప్పుడు నాలుగు వేళ్లు మనల్నే ఎత్తిచూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. ఆ సోయి లేనపుడు.. కనీసం వేలెత్తి చూపిన దానిలో తర్కమైనా చూపాలి. ఇవేవీ లేనప్పుడే పసలేని వాదనలు తెరపైకి వస్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోపిన ఫార్ములా-ఈ రేస్ కేసు కూడా ఇట్లనే తయారైంది. పెట్టిన కేసులో తర్కం లేదు.. చేస్తున్న వాదనలో పసలేదు.. మోకాలికి బోడిగుండుకు ముడేసినట్టు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో తయారైన ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి గ్రీన్కో సంస్థ రూ.40 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినందునే క్విడ్ ప్రోకోగా ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి చెల్లింపులు జరిగాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నది. కానీ, వాస్తవానికి సదరు సంస్థ బాండ్లను కొనుగోలు చేసిన ఏడాదికి ఫార్ములా ఈ-రేస్ ఒప్పందం జరగడం ఒకవంతైతే.. ఇదే గ్రీన్కో సంస్థ కేవలం బీఆర్ఎస్వి మాత్రమే కాకుండా అదే సమయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు మరో రెండు ప్రాంతీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొనుగోలు చేసింది. అంటే ఆయా పార్టీలు కూడా గ్రీన్కో సంస్థతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డాయా? ఆ మాటకొస్తే రేవంత్ సర్కారు ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టు లు కట్టబెడుతున్న మేఘా, అనుబంధ సంస్థలు వందల కోట్ల మేర కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయంటే ఇది కూడా అదే కోవలోకి వస్తుందా? అనే కీలక ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో సమస్యలపై ప్రజలు కన్నెర్రజేసినప్పుడు.. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు బయటపడ్డప్పుడు అయితే ఫార్ములా-ఈ కేసు… లేదంటే కాళేశ్వరం కమిషన్ వెంటనే తెరపైకొస్తాయనేది సామాన్యుడికి సైతం తెలిసిన రాజకీయ సత్యం. ఎలాగూ కాళేశ్వరం కమిషన్ కథ ఒడిసిపోవడంతో ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభు త్వం రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఫార్ములా-ఈ కేసును తెరపైకి తెచ్చింది. అదేమంటే ఇన్నాళ్లూ శోధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అందులో ఓ విచిత్రమైన విషయాన్ని కనుగొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిం ది. గ్రీన్కో అనే సంస్థ 2022, ఏప్రిల్‌లో బీఆర్ఎస్కు చెందిన రూ.40 కోట్ల ఎలక్టోరల్ బాం డ్స్‌ను కొనుగోలు చేస్తే.. అందుకు క్విడ్‌ప్రోకోగా ఫార్ములా-ఈ ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి నిధులు వెళ్లాయని ఏసీబీ నివేదికలో స్పష్టం చేసిందంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. మరి.. ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేస్తే అది క్విడ్‌ప్రోకో కిందకు వస్తుందంటే దేశంలో ఇవే సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు.. జరిగిన టెండర్ల ప్రక్రియలను పరిశీలిస్తే 2018-24 మధ్య జరిగిన వేలాది కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్ల ప్రక్రియ అంతా క్విడ్‌ప్రోకో కిందకే వస్తుందా? అన్నది కీలక ప్రశ్న!
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెట్రో నగరాల బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ఆయా ప్రభుత్వాలు అంతర్జాతీయ ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం కొన్నిరోజుల కిందట రూ.వందల కోట్లు వెచ్చించి ప్రపంచ అందగత్తెల పోటీని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే నిర్వహించినట్టు సెలవిచ్చింది. అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే కేసీఆర్ ప్రభు త్వం కూడా ఎలక్ట్రిక్ కారు రేసును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చొరవ చూపింది. ఈ మేరకు 2021, డిసెంబర్లో ఫార్ములా-ఈ సంస్థకు ప్రతిపాదనలు వెళ్లాయి. పదో సీజన్ రేసును హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వం, ఫార్ములా-ఈ మధ్య 2022, జనవరి 17న ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌ను ఎంపిక చేస్తూ ఫార్ములా-ఈ చీఫ్ కో ఫౌండర్ ఆల్బర్టో లాంగో, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఈవీ డైరెక్టర్ సుజ య్ కారంపురి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం 2022, అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఫార్ములా-ఈతో పాటు గ్రీన్కో సంస్థల మధ్య ట్రైపార్టీ ఒప్పందం జరిగింది. చివరకు 2023, ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ పదో సీజన్ రేసు హైదరాబాద్‌లో జరిగింది.
రాజకీయ పార్టీలకు గోప్యంగా విరాళాలిచ్చేలా ‘ఎలక్టోరల్ బాండ్ల’ పద్ధతిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2018 జనవరి మొదటివారంలో మొదలుపెట్టింది. ఈ విధానాన్ని పార్లమెంటు ఆమోదించింది. అప్పటి నుంచి 2024 జనవరి వరకు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పలు రాజకీయ పార్టీలకు చెందిన బాండ్లను కొనుగోలు చేశాయి. అంటే ఆరేండ్లలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 28,030 ఎలక్టోరల్ బాండ్లను వివిధ సంస్థ లు, వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.16,518 కోట్లు. ఇందులో రూ.12 వేల కోట్లకు పైగా ఆయా రాజకీయ పార్టీల ఖాతా ల్లో చేరాయి. వీటిల్లో భాగంగానే గ్రీన్కో సంస్థ 2022, ఏప్రిల్ 8న బాండ్లను కొనుగోలు చేసింది. కేవలం బీఆర్ఎస్వి మాత్రమే కాదు.. అదేరోజు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ బాండ్లను కూడా కొనుగోలు చేసింది. అదే నెల 22న టీడీపీ, అదే ఏడాది అక్టోబర్ 8న బీజేపీకి చెందిన ఎలక్టోరల్ బాండ్లను సదరు సంస్థ కొనుగోలు చేసింది. అయినా గ్రీన్కో కేవలం బీఆర్ఎస్ బాండ్లను మాత్రమే కొనుగోలు చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. చివరకు తన పార్టీకే చెందిన బాండ్లను కూడా కొనుగోలు చేసిందనే వాస్తవాన్ని దాచిపెడుతున్నది.
ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడాన్ని క్విడ్‌ప్రోకో అంటూ వింత వాదన వినిపిస్తున్న రేవంత్ సర్కారుకు కేరళ కాంగ్రెస్ నుంచి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన మేఘా కంపెనీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన రూ.94.6 కోట్ల జరిమానాను అక్కడి బీజేపీ సర్కారు ఇటీవల రద్దు చేసింది. బీజేపీకి చెందిన రూ.519 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ను మేఘా కంపెనీ కొనుగోలు చేయడమే ఇందులో మతలబు అని పేర్కొంటూ కేరళ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇదంతా క్విడ్‌ప్రోకో అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉన్నది. ఆ లెక్కన కాంగ్రెస్ నుంచి రూ.158 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ను మేఘా కృష్ణారెడ్డి, అనుబంధ కంపెనీలు కొనుగోలు చేశాయి. మరి ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి… రేవంత్ సర్కారు కట్టబెడుతున్న టెండర్లు, కాంట్రాక్ట్‌లు దేని కిందకు వస్తాయి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సూత్రీకరిస్తున్నట్టు రాజకీయ పార్టీల నుంచి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడమే క్విడ్‌ప్రోకో కిందకు వస్తే దేశవ్యాప్తంగా ఏకంగా 340 కంపెనీలు కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశాయి. అంటే ఈ కంపెనీలన్నింటితో కాంగ్రెస్ ప్రభుత్వాలు క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నట్టే కదా? ఇందులో మేఘా, దాని అనుబంధ సంస్థలూ ఉన్నాయి. ఈ కంపెనీలు ఏకంగా రూ.158 కోట్ల విలువైన కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయి. మేఘా ఇన్ఫ్రా రూ.18 కోట్లు, దాని అనుబంధ సంస్థలైన వెస్టర్న్ యూపీ పవర్ రూ.110 కోట్లు, సీఈపీసీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.30 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. 2019 మే, 2021 ఏప్రిల్ నెలల్లో రూ.5 కోట్ల చొప్పున బాండ్లను కొనుగోలు చేసిన సదరు సంస్థలు.. 2023, ఏప్రిల్ 7న రూ.8 కోట్లు, 2023, అక్టోబర్ పదో తేదీన రూ.90 కోట్లు, 2023, నవంబర్ 20న రూ.50 కోట్ల కాంగ్రెస్ బాండ్లను కొన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల టెండర్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ కంపెనీకి ఇచ్చింది. ఇదేమంటే.. టెండర్లలో పాల్గొని సదరు కంపెనీ పనులు దక్కించుకున్నట్టు నీతి వ్యాక్యాలు వల్లించే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినందున ఇది కూడా క్విడ్‌ప్రోకో కిందకు వస్తుందని అంగీకరిస్తుందా? అంతెందుకు.. రేవంత్ సర్కారు ఆరోపిస్తున్న గ్రీన్కో సంస్థ కాంగ్రెస్‌కు చెందిన రూ.70 లక్షల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిందనే వాస్తవానికి రేవంత్ ప్రభుత్వం చెప్పే సమాధానమేంది? 2018-2024 మధ్య ఆరు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తులు అనేక రాజకీయ పార్టీల నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క బీజేపీ ఖాతాలోనే రూ.6,500 కోట్లు జమ కాగా రెండో స్థానంలో కాంగ్రెస్ ఖాతాలో రూ.1300 కోట్ల వరకు జమయ్యాయి. అంతమాత్రాన ఆయా సంస్థలు, వ్యక్తులతో కాంగ్రెస్, బీజేపీ క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్టేనా? అనేది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉన్నది.