హైదరాబాద్ మే 11 (నమస్తే తెలంగాణ) : ఇటీవల సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌ను నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ .. కమిషనర్లుగా ఏడుగురిలో ముగ్గురికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో నలుగురిని తిరస్కరించినట్టు సమాచారం. ప్రధాన కమిషనర్, ఏడుగురు కమిషనర్ల ఎంపిక కోసం ప్రభుత్వం 8మంది పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఇందులో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని ప్రధాన కమిషనర్‌గా నియమించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కమిషనర్ల ఎంపిక ను పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన ఓ న్యాయవాది, ఓ టీవీ చానల్ సీనియర్ జర్నలిస్ట్, మైనార్టీ వర్గానికి చెందిన ఓ మహిళను కమిషనర్లుగా నియమించేందుకు ఆయన ఆమోదముద్ర వేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
కోదాడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన, అధికార పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌తోపాటు సుదీర్ఘకాలంగా గాంధీభవన్‌లో పీఆర్వోగా పనిచేస్తున్న నేత, సీఎం కార్యాలయ చీఫ్ పీఆర్వోగా, నిరుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యకితోపాటు మరో మహిళ పేరును గవర్నర్ తిరస్కరించినట్టు సమాచారం. వీరి ఎంపికపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందడంతో పక్కన బెట్టినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం మాత్రం ప్రతిపాదించిన పేర్లన్నింటినీ ఆమోదించేలా గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ మాత్రం ఆచీతూచి అడుగులు వేస్తున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి.