హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇటీవలే 19మందిని బలి తీసుకున్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. చెట్లకు నష్టం జరగకుండా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డిజైన్‌లో చేసిన మార్పులపై సంతృప్తి వ్యక్తంచేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే ఎత్తివేసింది. ఏడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల పొడవున రోడ్డును విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రణాళికలు రూ పొందిస్తున్నది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొత్తం 916 చెట్లకుగాను 156 చెట్లను ట్రా న్స్లొకేట్ చేయాలని, మిగిలిన 760 చెట్లను యథావిధిగా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మీడియన్‌ను ప్రతిపాదిత 5 మీటర్ల నుంచి కుదించి, 1.5 మీటర్లకు పరిమితం చేస్తూ రూపొందించిన డిజైన్‌ను ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.