హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ‘ఇంజినీరింగ్‌లో కొత్త సీట్లకు అనుమతులిచ్చేదే లేదు. ఆఖరికి కోర్సుల విలీనానికి ఒప్పుకోం. కోర్సుల కన్వర్షన్‌కు కూడా అంగీకరించం’. ఇష్టమొచ్చినట్టు ఇది బీటెక్ సీట్ల పెంపులో నిరుడు సర్కారు అవలంబించిన విధానం. ఫలితంగా నిరుడు 7వేల బీటెక్ సీట్లకు గండి పడింది. ఆఖరుకు పాత సీట్లను ఇవ్వమన్నా.. కుదరదు. వీలుపడదని చెప్పేసింది. అసలు.. కొసరు సీట్లు కూడా పోయాయి. కానీ, ఈసారి పాత ప్రమాణాలకు పాతరేసింది. రాత్రికి రాత్రే 9,433 కొత్త సీట్లకు అనుమతిచ్చింది. కొన్ని ప్రముఖ కాలేజీల్లోనే సీట్ల పెంపునకు పచ్చజెండా ఊపింది. సీట్లు పెరిగిన వాటిల్లో వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, ఎంవీఎస్సార్, సీవీఆర్, మాతృశ్రీ తదితర కాలేజీలున్నట్టు సమాచారం. కొన్ని కాలేజీలపై పగపట్టడం, కొన్ని కాలేజీలకు సడలింపునివ్వడం చర్చనీయాంశమైంది.
2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 14 ఇంజినీరింగ్ కాలేజీలు కోర్సుల కన్వర్షన్, మెర్జర్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు సీఎస్ఈలో కొత్త సీట్లకు అనుమతులివ్వాలని కోరాయి. ఈ సీట్లకు జేఎన్టీయూ ఎన్వోసీ జారీచేయగా, ఏఐసీటీఈ కూడా అనుమతులిచ్చింది. కానీ సర్కారు మొండికేసింది. అనుమతులివ్వమన్నది. దీంతో 14 కాలేజీల్లోని 7వేల సీట్లు రద్దయ్యాయి. దీనిపై కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. తీర్పు అనుకూలంగా రాకపోవడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అక్కడ ప్రముఖ న్యాయవాదుల ద్వారా, సర్కారు వాదనలు వినిపించింది. రూ.కోట్లు ఫీజుల రూపంలో చెల్లించింది. ఇది చూసినవారంతా ఆశ్చర్యపోయారు.
తాజాగా 9,433 కొత్త సీట్లకు సర్కారు అనుమతినిచ్చింది. దీంతో బీటెక్ సీట్లు ఇది వరకు 1,07,444 సీట్లుండగా, ఈ సీట్ల పెంపుతో సీట్ల సంఖ్య 1,16,877కు చేరింది. ఒక్క సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లోనే 6,810 సీట్లు పెరగడం గమనార్హం. కన్వీనర్ కోటాలో 90,921 సీట్లకు మొదటి విడతలో 59,880 సీట్లు భర్తీ అయ్యాయి. 30,941సీట్లను రెండో విడతలో భర్తీచేస్తారు. కాగా, రాష్ట్రంలో మొత్తం సీట్లలో 72% సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీలవే ఉన్నాయి. తాజాగా అనుమతులిచ్చిన 9,433 సీట్లలోనూ సీఎస్ఈ సీట్లున్నాయి. ఈ సీట్లు పెరిగితే యాజమాన్య కోటా సీట్లు కూడా పెరుగుతాయి.
సర్కారు వారే ఆయా సీట్లను అమ్ముకోవడానికి సింహద్వారాలు తెరిచినట్టు అయ్యింది. ఈ సీట్ల పెంపుకోసం కొన్ని కాలేజీలు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ లాబీయింగ్‌కు తలొగ్గే సర్కారు 9,433 కొత్త సీట్లకు అనుమతులిచ్చినట్టు తెలిసింది. దీని వెనుక భారీ తతంగం జరిగినట్టు.. సీట్ల పెంపు వెనుక బిగ్ డీల్ కుదిరినట్టు.. పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం జరుగుతున్నది.