హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులకు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తిప్పలు తప్పేలా లేవు. టెండర్ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యమే ఇందుకు కారణమని తెలిసింది. సాగులో రసాయనిక ఎరువులు తగ్గించేందుకు రైతులు ఆసక్తి చూపుతుంటే.. ఇందుకు విరుద్ధంగా రైతులను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంటల సాగులో యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకుగానూ బీఆర్ఎస్ ప్రభుత్వం సహజ ఎరువుల వినియోగంపై దృష్టిపెట్టింది. ఏటా రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేసింది. జనుము, జీలు గ, పిల్లిపెసర సాగు చేయడం వల్ల పంట కు కావాల్సిన నత్రజని, బాస్వరం, పొటాషియం లభిస్తాయి. దీంతో యూరి యా, ఎన్పీకే వినియోగం తగ్గుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది 2.47 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందించాలని నిర్ణయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పిలిచిన టెండర్లకు సరఫరాదారుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినా ఎవరూ ముందు కు రావడం లేదని తెలిసింది. తొలుత గత నెల 10న టెండర్లను పిలిచిన కార్పొరేషన్ దరఖాస్తుకు అదే నెల 17 వరకు గడువు ఇచ్చింది.
ఆ తర్వాత మార్చి 24 వరకు పొడిగించింది. అయినప్పటికీ టెండర్లు రాలేదు. మరోసారి ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగించింది. ఇప్పుడు కూడా టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా మరోసారి ఈ నెల 9 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా కేవలం ఇద్దరో, ముగ్గురో సరఫరాదారులు మాత్రమే ముందుకొచ్చినట్టుగా తెలిసింది. ఈ ఏడాది కూడా గత ఏడాది పరిణామాలు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.