హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): మట్టికి జీవజాలానికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, అందుకే మట్టితల్లిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్-మట్టిని రక్షించు ఉద్యమం ఆధ్వర్యంలో మట్టి క్షీణత అనే క్లిష్టమైన సమస్యపై శనివారం శిల్పారామంలోని రాక్ హైట్స్ వేదికగా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ, మట్టికి.. మనిషికి ఉన్న బంధం గురించి చెప్పడానికి డిక్షనరీలో పదాలు లేవని అన్నారు. చరాచర జగత్తుకు మట్టే ఆధారమని పేర్కొన్నారు. ఈ మట్టిలేనిదే మన మనుగడ లేదని, మన అస్తిత్వానికి మట్టి, మొక్కే ప్రాణభూతమని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మట్టి మనిషి అని, ఆయనకు, మట్టికి విడదీయరాని సంబంధం ఉన్నదన్నారు. 25 ఏండ్లుగా మొకలు పెంపొందించడంపై సీఎం అవగాహన కల్పిస్తున్నారని, ఆయన స్ఫూర్తితోనే తాము గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ఈషా ఫౌండేషన్ ద్వారా సద్గురు.. 25 సంవత్సరాల క్రితం సేవ్ సాయిల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం గ్రేట్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సారవంతమైన మట్టి కోసం ఈ కృషి నిరంతరం జరగాలన్నారు. రైతుల పొలాలు సారవంతం కావడానికి తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మిషన్ కాకతీయ పథకం చేపట్టి.. పూడిక మట్టిని రైతుల పొలాల్లోకి తరలించామని, తమ ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించారు. మట్టిని, మొక్కను రక్షించుకోవాలన్నది మన నినాదం కావాలన్నారు. ప్రసిద్ధ గాయకులు రామ్, మంగ్లీ, సాహితి, రమ్య బెహరా, సందీప్, శ్రీలలిత ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.