హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. జలసౌధ ప్రాంగణంలో గురువారం 687 మంది ఏఈఈలకు సీఎం నియామక పత్రాలను అందించారు. అనంతరం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలని చెప్పారు. ఐఏఎస్ అధికారుల నుంచి ఇంజినీర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కొండా లక్ష్మణ్‌బాపూజీ సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. గురువారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి ఆయన పేరుపెట్టి సమున్నతంగా గౌరవించామని తెలిపారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.