రుచికి తీయగా, పుల్లగా ఉండే నల్ల ద్రాక్షలు.. ఆరోగ్యానికీ భరోసా ఇస్తున్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్‌ను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయాన్ని లండన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్-ద్రాక్షపై చేపట్టిన ఓ విస్తృతమైన పరిశోధనలో.. అనేక విషయాలను కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా క్యాన్సర్ బాధితుల ఆహారంలో ద్రాక్షపండ్లు రెగ్యులర్‌గా ఉండేలా చూసుకున్నారు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని గమనించారు.
క్యాన్సర్ కణాల అభివృద్ధి, వ్యాప్తిని నిరోధించడంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే సహజ సమ్మేళనం సమర్థంగా పనిచేస్తున్నదని వెల్లడించారు. రెస్వెరాట్రాల్ అనేది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండే ఒక పాలీఫెనాల్. నల్ల ద్రాక్ష పండ్ల తొక్కలో ఇది అధిక మొత్తంలో లభిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో, ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో ఈ రెస్వెరాట్రాల్ సహాయపడుతుందని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
అదే సమయంలో ద్రాక్ష గింజల్లో కనిపించే ‘ప్రోయాంతోసైనిడిన్స్’.. అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి కూడా. ముఖ్యంగా, జంతువులపై చేసిన పలు ప్రయోగాల్లో.. ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్‌కు ఈ ప్రోయాంతోసైనిడిన్స్ వ్యతిరేకంగా పనిచేస్తాయని వెల్లడైంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా.. దాని ముప్పును మాత్రం నల్లద్రాక్షలు గణనీయంగా తగ్గించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.