నటశేఖర కృష్ణ నట వారసుడిగా పరిచయమైన మహేశ్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విషయం విదితమే. త్వరలో ఆయన కుటుంబం నుంచి మరో స్టార్ రానున్నది. తానెవరో కాదు. మంజుల ఘట్టమనేని గారాలపట్టి, సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్‌బాబు మేనకోడలు అయిన జాన్వీ ఘట్టమనేని. ఇటీవల వెలుగు చూసిన జాన్వీ ఫొటోలకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తున్నది. త్వరలో తెరపై కనిపించనున్న అత్యంత అందమైన అమ్మాయిగా ఇండస్ట్రీ వర్గాలు ఆమెను కొనియాడుతున్నాయి.
అందం, అభినయంతో పాటు పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్, గేమింగ్ ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్నారు జాన్వీ. అందం, ప్రతిభ, వారసత్వ మేలు కలయికగా జాన్వీని పలువురు అభివర్ణిస్తున్నారు. నిజానికి జాన్వీ తల్లిగారైన ఘట్టమనేని మంజుల ఒకప్పుడు హీరోయిన్ కావాల్సింది. కానీ కృష్ణ అభిమానులు అందుకు అంగీకరించలేదు.
ఈ విషయంపై మంజుల మాట్లాడుతూ ‘నన్ను అడ్డుకున్న వారే ఇప్పుడు జాన్వీ రాక కోసం ప్రార్థిస్తున్నారు. జాన్వీ చిరునవ్వు నా ప్రార్థనలకు సమాధానం’ అన్నారు. తన తల్లి దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా ద్వారా పదేళ్ల వయసులోనే కెమెరా ముందుకొచ్చిన జాన్వీ.. తన సహజమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నది. త్వరలో ఈ ఘట్టమనేని అందం కథానాయికగా పరిచయం కానున్నది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలుగు చూడనున్నాయి.