ములుగు: ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్‌లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్‌కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్టారు. అయితే అనుమతి లేకుండా జెండాలు పెట్టారనే కారణంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడి చేరుకుని.. సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో వారు తోరణాలను తొలగించడాన్ని ఆపేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి, పార్టీ నాయకులు పోరిక గోవింద్ నాయక్, విజయరామ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ జెండాలు, కేసీఆర్ ఫొటోల తొలగింపుపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వస్తే బ్యానర్లు ఉంటయి, రాహుల్ గాంధీ వస్తే బ్యానర్లు ఉంటయి, సీఎం సోదరుల పుట్టిన రోజు బ్యానర్లు ఉంటయి, డిప్యూటీ సీఎం భార్య బ్యానర్లు ఉంటయి. వీళ్లకు పర్మిషన్లు ఉండవు, ఆంక్షలు ఉండవు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష రోజైన దీక్షా దివస్ బ్యానర్లు మాత్రం తొలగిస్తారా అని మండిపడుతున్నారు. తెలంగాణకు అడ్డం పడ్డోళ్లకు తెలంగాణలో చోటుంటది కానీ, రాష్ట్రాన్ని సాధించిన తొలి సీఎంకి చోటు లేదా అని ప్రశ్నిస్తున్నారు.