ఆఖరు రోజూ అదే తీరు.. నిరసనలు, నిలదీతలు.. అధికారుల డొంకతిరుగుడు సమాధానాలు.. కాంగ్రెస్ నాయకుల దబాయింపులు.. పోలీసుల అడ్డగింతలు.. పథకాల జాబితాల్లో పేర్లు లేని జనం గగ్గోలు.. ఆక్రోశం.. ఆక్రందనలు.. నాలుగు పథకాల అమలు కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన గ్రామసభల్లో అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అనర్హులను ఎలా ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్న జనంపై, బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు ఏకంగా కొన్నిచోట్ల దాడులకు దిగారు. వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తీవ్ర బెదిరింపులకు దిగారు.
Grama Sabhalu | నమస్తే తెలంగాణ నెట్వర్క్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహంంతో వేదిక ముందు బైఠాయించారు. చింతలమానేపల్లిలో జాబితాల్లో అర్హుల పేర్లు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గూడెంలో ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో అనర్హులు, సంపన్నులకు ప్రాధాన్యమిచ్చారని, అర్హులైన తమకు ఇవ్వలేదంటూ అధికారులను నిలదీసి, వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తప్పుల జాబితాలపై నిరసనగా వాంకిడి మండలం ఖిరిడీలో కలెక్టర్ వచ్చే వరకు సభ నిలిపివేయాలని వాగ్వాదానికి దిగారు. తిర్యాణి మండల కేంద్రంలో చనిపోయిన వారిపేర్లు రావడం, ఒకే ఒంట్లో ఇద్దరు లబ్ధిదారుల చొప్పున ఉండటంపై గ్రామస్థులు నిలదీశారు. కౌటాలలో ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్వాడ గ్రామంలో మొత్తం 714 మందికి జాబ్ కార్డులు ఉండగా అందులో ఆరుగురికే ఆత్మీయ భరోసా పథకం రావడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,200 మంది రైతులకు గాను 800 మందికి రుణమాఫీ కాలేదని భగ్గుమన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో గ్రామసభ ఫ్లెక్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో లేకపోవడంపై గ్రామస్థులు నిలదీశారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సభకు రావడంపై బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తాజామాజీ సర్పంచ్ వంతడపుల నాగరాజు గ్రామసభ సాక్షిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఐ రాజు, ఇతర పోలీసులు అడ్డుకొని పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల మల్లాపూర్ మండల కేంద్రానికి హుటాహుటిన చేరుకొని నాగరాజును పరామర్శించారు. గ్రామసభలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని హరీశ్‌రావు, సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం, సంగారెడ్డి జిల్లా కందిలో వేర్వేరుగా ఇద్దరు సెల్‌టవర్ ఎక్కి నిరసనగా దిగారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన మామిడాల రాజు అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాకపోవడంతో సెల్‌టవర్ ఎక్కాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్‌పై నుంచి గ్రామస్థులకు ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో టవర్ వద్దకు వచ్చిన గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా వినకలేదు. మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ వచ్చి హామీ ఇవ్వడంతో సెల్‌టవర్‌ను దిగాడు. సంగారెడ్డి జిల్లా కందిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఎండీ మహ్మద్ అనే వ్యక్తి సభా ప్రాంగణంలో ఉన్న సెల్‌టవర్ ఎక్కే ప్రయత్నంచేశాడు. తనకు ఇల్ల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, లేకుంటే టవర్ ఎక్కి దూకి చస్తానంటూ బెదింరించాడు. అధికారులు హామీ ఇచ్చి అతడిని కిందకు దింపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామసభలో జల్లి బాలమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛన్ రావడం లేదంటూ అధికారుల ఎదుట కన్నీరు పెట్టుకున్నది. అధికారులు కాళ్లు మొక్కేందుకు ఆమె యత్నించగా వారించారు. ఈ ఘటన అక్కడున్న వారందరి మనసును చలింపజేసింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తమ అక్కసు వెళ్లగక్కారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాటలకు ప్రతిగా, కౌశిక్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ రాజకీయ విమర్శలు చేయొద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీకి సూచించారు. ఎమ్మెల్యేకు కూడా ఏసీపీ చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు స్టేజీమీదకు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్టేజీ కిందకు దిగి ప్రజల మధ్యకూర్చుని ప్రభుత్వం కమలాపూర్‌కు ఎన్ని ఇండ్లు ఇస్తరో చెప్పాలంటూ ప్రశ్నించడంతో కాంగ్రెస్ నాయకులు మరింత అసహనానికి గురై ఎమ్మెల్యేపై రాళ్లు, టమాటాలు విసిరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు నినాదాలకు దిగడంతో గందరగోళం నెలకొన్నది. కేవలం పంచాయతీ ఎన్నికల కోసమే ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతుందని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సభను బాయ్‌కాట్ చేస్తున్నానని చెప్పి కుర్చీలోంచి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేవడంతో కాంగ్రెస్ నాయకులు మళ్లీ కోడిగుడ్లు విసరడంతో మండల వ్యవసాయాధికారి రాజ్‌కుమార్‌కు తగిలాయి. పోలీసులు వెంటనే ఎమ్మెల్యేను కాన్వాయ్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాంగ్రెస్ నాయకులు చెప్పులు విసిరారు. ఏసీపీ తిరుమల్ పోలీసు బందోబస్తుతో ఇరువర్గాలను వారించారు.
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూ రు గ్రామపంచాయితీలోని ప్రగళ్లపల్లి క్రీడాప్రాగణంలో పథకాలకు దరఖాస్తులను సెల్‌ఫోన్ లైట్ల వె లుతురులో అధికారులు, సిబ్బంది స్వీకరించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్యా హ్నం సభలో హాజరై వెళ్లారు. 3.30 గంటల అనంతరం గ్రామసభ ముగించి అధికారులు వెళ్లిపోయా రు. ప్రజలు రాత్రి 8 గంటల వరకు చీకట్లోనే సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో పంచాయతీ కార్యదర్శి గడ్డం కార్తీక్, సిబ్బంది ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కనీసం లైట్లు ఏర్పాటులేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల పేరుతో ఏకపక్షంగా జాబితాలు రూపొందించుకున్నారంటూ అన్ని గ్రామాల్లో ప్రజలు ఆగ్రహించారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో ప్రజలు పెద్ద ఎత్తున అధికారులపై తిరగబడ్డారు. అశ్వారావుపేటలో ఓ అంధుడు అధికారులను నిలదీశాడు. ఏకంగా సభావేదికపైకి చేరుకొని ‘నేను ఇందిరమ్మ ఇంటికి నేను అర్హుడిని కాదా సారూ’ అంటూ ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతడిని బలవంతంగా కిందకు దించేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన ఐత ప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కీలకమైన నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఐత ప్రకాశ్‌రెడ్డి, ఆయన కుమారుడు ఐత రవికిరణ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి పేర్లు కూడా చదవడంతో ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఇండ్లు లేనివారిని పక్కనబెట్టి అన్నీ ఉన్నోళ్లకు ఇచ్చుడేందంటూ గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నామినేటెడ్ పదవిలో ఉన్న కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యుల పేర్లు ఇండ్ల జాబితాలో రావడం చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట గ్రామసభకు సాక్షాత్తూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరైనప్పటికీ గ్రామస్థులు రాకపోవడంతో అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఉదయం 8 గంటలకు గ్రామసభ ఉండగా, అటు అధికారులు కానీ, ఇటు గ్రామస్థులు కానీ ఆ సమయానికి హాజరుకాలేదు. అప్పటికే ఎమ్మెల్యే రావడంతో వేదికపైన కొద్దిమంది అధికారులే ఉన్నారు. దీంతో అధికారుల తీరుపై ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఖాళీ కుర్చీలున్నా, ఒకరిద్దరు గ్రామస్థులు, అధికారులకే ప్రసంగం వినిపించి అక్కడినుంచి మరో ఊరి గ్రామసభకు వెళ్లిపోయారు.
టేకులపల్లి మండల గ్రామసభల్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. పథకాలన్నింటికీ ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్లనే ఎంపిక చేశారంటూ అధికారులను గ్రామస్థులు నిలదీశారు. టేకులపల్లి పంచాయతీలో ఎంపీడీవో రవీందర్రావు అర్హుల జాబితాను చదవగా అందులో అర్హుల పేర్లు లేకపోవడంతో మహిళలు ఒక్కసారిగా సభా వేదికపైకి దూసుకొచ్చారు. పేర్లన్నీ కాంగ్రెస్ వాళ్లవే ఉన్నాయంటూ అధికారులను ప్రశ్నించారు. అక్కడే ఉన్న సీఐ తాటిపాముల సురేశ్, ఎస్సై శ్రీకాంత్ గ్రామస్థులను సముదాయించారు. అయినా వారు శాంతించకపోవడంతో అధికారులను పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో గ్రామసభకు హాజరైన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను పథకాలపై గ్రామస్థులు నిలదీశారు. రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టేందుకేనని, అర్హులందరికీ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పూర్తిగా వినే వరకు గ్రామసభ నుంచి వెళ్లిపోవద్దని గ్రామస్థులు అడ్డుకోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సీపీఐ, సీపీఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. గుండాల మండలం వంగాల గ్రామంలో కూడా విప్ బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. సీసీ రోడ్డు శంకుస్థాపన కోసం అయిలయ్య శుక్రవారం గ్రామానికి రాగా, గ్రామస్తులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన ప్రజాపాలన గ్రామసభలో నిరుపేదల పేర్లు లబ్ధిదారుల జాబితాలో రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు గ్రామసభల్లో రసాభాస నెలకొన్నది. నిడమనూరు మండలం గుంటకగూడెంలో రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. నకిరేకల్ మండలం తాటికల్లులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో పేదలు ఆగ్ర హం వ్యక్తంచేశారు. మర్రిగూడ మండలం రాజపేటతండాలో జాబితాల్లో అనర్హులు ఉండటంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్ హాజరు కాకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని 13వ వార్డు ప్రజలు ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా రామలక్ష్మిపురంలో అర్హుల పేర్లు జాబితాలో లేవని ఆగ్రహంతో గ్రామసభ టెం ట్ను కూల్చారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలపై నిలదీశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతుండగా సంక్షేమ పథకాల అర్హుల పేర్లను చదివిన తర్వాతే మాట్లాడాలని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. దాంతో సభ అర్ధాంతరంగా ముగిసింది. అర్వపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే సామేల్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. సంక్షేమ పథకాల అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని, తాము ఎవరికి చెప్పుకోవాలని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల జరిగిన సభల్లో అధికారులను స్థానికులు అడ్డగించారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం సభ రచ్చరచ్చగా మారింది. పథకాల జాబితాల్లో అర్హుల పేర్లు లేవని అధికారులపైకి దండెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడలో రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితాలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేశ్‌రెడ్డి పేరు ఉండటంతో గ్రామసభ గందరగోళంగా మారింది. కార్పొరేషన్ చైర్మన్ పేరు ఎలా వచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆయనకు రేషన్ కార్డు ఎలా మం జూరు చేస్తారని నిలదీశారు. దీంతో చైర్మన్ పేరును తొలగిస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి ప్రకటించారు.
‘జెండా పట్టుకుని ఇల్లిల్లు తిరిగిన.. కాంగ్రెస్ పార్టీ గెలవాలని దేవుడికి మొక్కుకున్న.. గూడు లేని నాకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు వస్తదనుకుంటే రాలేదు.. ఉన్న వాళ్లకే సంక్షేమ పథకాలు ఇస్తున్నరు..’ అని కాంగ్రెస్ వీరాభిమాని ఒకరు నిర్వేదం వ్యక్తం చేశాడు. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ వద్ద నిలబడి కాంగ్రెస్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తంచేశాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం శివారు చోక్లతండాలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్‌పై విరక్తితో రేవంత్‌రెడ్డిపై, కోరం కనకయ్యపై శాపనార్ధాలు పెట్టాడు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు చెందిన మాచర్ల మంగమ్మ తనకు గుంట భూమి లేదని, కూలిపనులు చేసుకుని బతుకుతున్నా అని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో తనపేరు లేకపోవడంపై ఆమె కన్నీటపర్యంతమైంది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా గ్రామసభల్లో విపక్షాలు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అడ్డుకునే వారిని టెంట్ కిందనే కట్టేయాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సూచించారు. ‘కావాల్సింది అడగాలి.. మేము జిమ్మేదారిగా ఉంటాం. ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ముందుపెడితే రాలేదని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నాం కదా. ఎందుకు గొడవ చేస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొడ్తిమాట్తండాలో గ్రామసభలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై అధికారులు వివరిస్తుండగా, అర్హుల పేర్లు ఎందుకు ఎంపిక చేయలేదని బీఆర్ఎస్ నాయకులు సుమన్, ప్రవీణ్, అశోక్, వెంక న్న, భద్రు ప్రశ్నించారు. ప్రతిగా కాంగ్రెస్ నాయకులు పూల్యా, కృష్ణ, రమేశ్లక్ష్మా, బాలు జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కుర్చీలతో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తూ గేటు ముందు వరకు తరుముతూ దాడి చేశారు. ఈ దాడిలో లకావత్ అశోక్, ప్రవీణ్ తలకు, గుగులోత్ అశోక్, గుగులోత్ భద్రు కాళ్లకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండలో జరిగిన గ్రామసభలో మహిళ కొంపెల్లి మమత అస్వస్థతకు గురికాగా, వైద్య సిబ్బంది లేక స్థానికులే దవాఖానకు తరలించారు.