Local Body Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తేతెలంగాణ): బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కాదని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. పార్టీ రహితంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయడం ఇప్పటికిప్పుడు వీలుకాదన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఈ పరిస్థితుల్లో ముందుగా పార్టీల గుర్తు ల ఆధారంగా జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్, ఇటు యంత్రాంగానికి మౌఖికంగా సూచనలు ఇచ్చినట్టు అధికార పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతున్నది. అంతా అనుకున్నట్టు జరిగితే పరిషత్ ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోనే పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక ఎన్నిక ల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకోసం ని రుడు సెప్టెంబర్‌లో బీసీ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌కు చట్టబద్ధత లేదని బీసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావడంతో నవంబర్‌లో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నే తృతంలో క్యాబినెట్ సబ్‌కమిటీని నియమిం చి, ఆ వెంటనే కులగణన సర్వే నిర్వహణకు ఉపక్రమించింది.
మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి సర్వే నివేదిక అందింది. ఈ సర్వేపై ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన ప్రత్యే క అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసింది. దీనిపై చర్చించిన తరువాత బీసీలకు 42% కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. చట్టసవరణ చేయాలని కోరింది. అంటే ఇప్పటికిప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తేలడంతో కాంగ్రెస్ తరుఫున బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఇప్పటికిప్పుడు లేకపోవడంతో సాధ్యమైనంత తొందరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సంకల్పిస్తున్నది. ఈ నెల 15 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించినట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల పునర్వ్యవస్థీకరణను కూడా పూర్తిచేయాలని నిర్దేశించినట్టు తెలిసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వస్తే ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.