Panchayat Elections | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కులగణన చేపట్టామని, దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో భారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపైనే పడుతున్నదని, పనిభారాన్ని తగ్గించేందుకు గ్రామాల్లో అధికారులను నియమిస్తున్నట్టు చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
గ్రామ కార్యదర్శుల అపాయింట్మెంట్ డేతోపాటు నాలుగేండ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకునే అం శం, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించడంతోపాటు ఇతర అంశాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులను త్వరలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ తదితరులు పాల్గొన్నారు.