Farmers | ఏటూరునాగారం/ములుగురూరల్, మే 19 : అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది. ఆరబోసుకున్న ధాన్యంపై కప్పిన టార్పాలిన్లపై పేరుకుపోయిన నీటిని ఎత్తిపోయడం, షీట్లను దులిపి మళ్లీ కప్పుకోవడం రైతుకు దినచర్యగా మారింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తూకాలు జరగడం లేదు. ఈ క్రమంలో కురిసిన వర్షంతో ధాన్యం తడువగా, రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీల కొద్దీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. దీనికితోడు వడ్లు నింపుకొనేందుకు ఖాళీ బస్తాలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో టార్పాలిన్ షీట్లు తిప్పేసుకునేందుకు కూడా కూలీలను పెట్టుకోవాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పండించిన పంట అమ్ముకోవడమూ రైతులకు కష్టంగా మారింది. క్వింటా వడ్లకు రూ. 500 బోనస్ ఎప్పుడిస్తారోనని ఎదురు చూస్తున్నారు. కాగా ములుగు రూరల్ మండలంలోని బండారుపల్లి శివారులో రైతులు తడిసిన వడ్లను ఆరబోశారు. మొలకలు వచ్చిన వడ్లను, మంచి వడ్లను వేరు చేసి ఎండబోస్తూ తంటాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వడ్లను కాంటా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
15 రోజులైనా కొనే దిక్కులేదు..
ఏటూరునాగారంలోని కొనుగోలు కేంద్రానికి తెచ్చి 15 రోజులైనా ధాన్యం కొంటలేరు. వడ్లు ఆరబోసి టార్పాలిన్ షీట్లు కప్పినా కింద నల్ల రేగడి భూమి కావడంతో తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షం రాగానే కుప్పలపై పరదాలు వేస్తున్నాం. తర్వాత తీస్తున్నాంం. రోజూ ఇదే పని అవుతున్నది. వడ్లు నింపుకొనేందుకు ఖాళీ బస్తాలు ఇస్తలేరు. ధాన్యం కొనకుంటే ఎట్లా? తేమ ఎక్కువగా ఉందని అంటున్నరు. ఈ వర్షాల నుంచి వడ్లను ఎలా కాపాడుకోవాలో అర్థమైతలేదు. ఇంకెన్ని రోజులు ఇక్కడ కుప్పలకు కాపలా ఉండాలో తెలుస్తలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేం నిండా మునుగుడే.
– మాటూరి లక్ష్మయ్య, ఏటూరునాగారం