నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతోపాటు తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. కరీంనగర్ మార్కెట్‌యార్డులో ఉన్న వడ్లు, మక్కలు వరదకు కొట్టుకుపోయాయి.
తూకం వేసిన బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రైతులు నీటిని ఎత్తిపోసేందుకు అవస్థలు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జనగామ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసి తరలింపునకు నోచుకోని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, ధన్నూర్(బీ)లో జొన్నలు తడువకుండా ఉండేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డులో జొన్న సంచులు తడిశాయి. ఉట్నూర్‌లో వడ్లపై కవర్లు కప్పి పంటను కాపాడుకున్నారు. ఉట్నూర్ మండలం గంగన్నపేట్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల కింద నీరు నిలిచి సంచులు తడిశాయి. పెంబిలోని కోనుగోలు కేంద్రంలో మక్కజొన్న, వరి పంట తడిశాయి. కాగా నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పిడుగుపడటంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు.