నమస్తే నెట్వర్క్, మే 10 : అకాల వర్షం రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి వరంగల్‌తోపాటు పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వానకు ధాన్యం తడిసిముద్దయింది. జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలైంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కార్మికుడు బిట్టు (30)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
కాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డు, ధర్మారం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవగా, కొంత ధాన్యం కొట్టుకుపోయింది. భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు పడిపోగా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. బలమైన ఈదురుగాలులతో జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.