నమస్తే నెట్వర్క్, మే 17 : రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట, వట్టిమల్ల, సుద్దాల, నిజామాబాద్, మామిడిపల్లితోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులుపడ్డారు. సారంగాపూర్ మండలం పెంబట్లలోని కొనుగోలు కేంద్రంలోకి భారీగా వరదనీరు చేరి తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయా యి. మల్యాల మండలంలోని పలు కేంద్రా ల్లో తూకం వేసిన బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయి. రామన్నపేటలో తూర్పారబట్టిన నాణ్యమైన ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్ల ర్లు వెనుకడుగు వేయడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండగా, శుక్రవారం కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయా యి. కొడిమ్యాల మండలం నల్లగొండలో జోకిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి, పొన్నారం, బొక్కలగుట్టలో కాంటా చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో తడిసిపోయింది. సారంగపల్లిలో మొలకెత్తిన వడ్లను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నెపల్లి మండలం మాడవెల్లి, కన్నెపల్లి, లింగాల, మెట్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు నిలిచి.. వడ్లు తడిశాయి. కోటపల్లి మండలం షట్పల్లి, పారుపల్లి, కొల్లూరు, ఆలుగామ, బొప్పారం, కోటపల్లిలోని కేంద్రాల్లో ధాన్యం వరదలో నానిపోయింది.
కవర్లు కప్పినా వడ్లు కొట్టుకుపోయాయి. వేమనపల్లి మండలంలో కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. నెన్నెల మండలంలోని గొల్లపల్లి, జోగాపూర్, మైలారం, ఘన్పూర్, నెన్నెల గ్రామాల్లో రెండు వందల ఎకరాలకు పైగా వరి నీటమునిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు సైతం తడిసిపోయాయి. కాగా ఆసిఫాబాద్ జిల్లా నెన్నెల మండలం లంబాడా తండా ఎర్రవాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు కోతకు గురైంది.