సిరిసిల్ల రూరల్, మార్చి 29: సిరిసిల్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని, సొసైటీల మనుగడను దెబ్బతీయవద్దని సిరిసిల్ల సింగిల్‌విండో డైరెక్టర్లు, సభ్యులు, రైతులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. శనివారం సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాలులో సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ.. చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా దేవదాస్‌గౌడ్ మాట్లాడారు. కేవలం సిరిసిల్ల నియోజకవర్గంలోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలు నిలిపివేయడం సరైంది కాదని చెప్పారు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే సొసైటీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు.
మహిళా సంఘాలకు సగం, సొసైటీలకు సగం సర్దుబాటు చేసి కొనుగోలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి కొనుగోలు కేంద్రా లు యథావిధిగా నిర్వహించేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మహాజనసభలో ఎజెండా అంశాలు, బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. కొనుగోలు కేంద్రాలు యథావిధిగా నిర్వహించాలని తీర్మానం చేశారు.