నమస్తే నెట్వర్క్ : రాష్ట్రంలో ఊరూరా ధాన్యం కొనుగోలు ప్రహసనంగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాలకొద్దీ వేచి చూసినా కాంటాలు కావడం లేదు. ఈ సమయంలో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల వరదలకు కొట్టుకుపోతున్నది. మరికొన్ని చోట్ల దొంగల బెడద నిత్యకృత్యంగా మారింది. ఈ నేపథ్యంలో కాంటాలు పెట్టాలని ధాన్యం రైతులు నిత్యం కేంద్రాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇదే దశలో కాంటాలు పెట్టడంలేదని ఆగ్రహిస్తూ ఆదివారం పలుచోట్ల అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. వరి కోతలు పూర్తయి 15 రోజులు గడిచినా కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ సిబ్బందిని రైతులు నిలదీశారు.
ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంగా ఉన్నదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రిపూట ఇష్టమొచ్చిన వారికే బస్తాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పక్షపాతంతో కొంతమంది ధాన్యమే కాంటాలు పెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 10 రోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, వర్షానికి ధాన్యం తడిసిపోతున్నదని, కొన్నవాటికి లారీలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళనను విరమించేదిలేదని పట్టుబట్టారు. కూసుమంచి ఎస్సై అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. లారీలను వెంటనే పంపిస్తామని, కాంటాలు వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని పెదిరిపాడు రోడ్డులోని పద్మావతి రైస్ మిల్లు వద్ద దొడ్డురకం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం దించుకోవాలని కోరారు. సివిల్ సప్లయ్ డీటీ ఆనంద్ హామీతో ఆందోళన విరమించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తేనే కొంటామని నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లేదంటే రెండు నుంచి మూడు శాతం తరుగు తీసి వడ్లు కొనుగోలు చేస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల సకాలంలో లారీలు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వారం వరకు కొనుగోలు చేయడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో కూడా పరిస్థితి ఉన్నట్టు రైతులే చెప్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో వరుస దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 30న కొనుగోలు కేంద్రంలో ఎండబోసిన రైతు నీరటి గోపాల్‌కు చెందిన 10 బస్తాల ధాన్యం మాయమైన ఘటనను మరువక ముందే తాజాగా అదే గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాస్‌రెడ్డి ధాన్యం కనిపించకుండా పోయింది. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పగా పోశాడు. అధికారులు కాంటా పెట్టకపోవడంతో ఇదే అదనుగా దొంగలు దోచుకెళ్లారు. కొనుగోలు కేంద్రంలో ఎండబోసిన, కుప్పలుగా ఉంచిన 77 మంది రైతుల దొడ్డు వడ్లు, 18 మంది రైతుల సన్న వడ్లు కొనాల్సి ఉండగా వారంతా తమ ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నాకున్న 19 గుంటల భూమిల ఎల్లిన 12 క్వింటాళ్ల వడ్లు ఐకేపీ గోదాం కాడ కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులైంది. రెండు రోజులకే మ్యాచర్ వచ్చిందన్నరు. కానీ ఇంకా కాంటా పెట్టలే. నా సీరియల్ నంబర్ 48. నా నంబర్ వచ్చేవరకు ఇంకా నాలుగైదు రోజులు పడ్తది అంటే ఇక్కన్నే ఎండబోసిన. రాత్రి కుప్పజేసి ఇంటికి పోయిన. పొద్దుగాల్ల వచ్చేవరకు కుప్ప కింద ఉన్న కవర్, కుప్ప, కుప్ప మీద ఉన్న కవర్ కూడా ఎత్తుకపోయిర్రు. ఇక్కడ ధాన్యం పోసిన ఆనవాళ్లు కూడా లేకుండా దొంగలెత్తుకపోయిన్రు. రోజురోజు లేటయినకొద్దీ దొంగలెత్తుకపోవట్టిరి. ఇగ రైతుకేం లాభం జేస్తున్నరు. ఏం మిగులుతది.
యాసంగిలో నేను 39 ఎకరాలు వరిసాగు చేశాను. వారం క్రితం ధాన్యాన్ని మధిర మార్కెట్‌కు తీసుకొచ్చాను. ఇంతవరకు కొనుగోలు చేసిన దిక్కులేదు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకోవడమే సరిపోతున్నది. మిల్లర్లు ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. అకాల వర్షం భయం వెంటాడుతున్నది. దాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నం. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. కటింగ్ పేరుతో బస్తాకు 5 కిలోల తరుగు తీస్తున్నామని రైస్‌మిల్లర్లు చెప్తున్నారు.