హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది 11 లక్షల మెట్రిక్ టన్నులు (30శాతం) అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇప్పటివరకు 42.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ వానకాలంలో రైతులు పండించి ప్రతి ధాన్యం గింజను కొంటామని స్పష్టం చేశారు. మంత్రుల నివాసంలో సోమవారం ఆయన ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు 6775 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 4.50 లక్షల మంది రైతులకు రూ. 5,447 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.
కేంద్రం, ఎఫ్‌సీఐ విధానాలే కారణం
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అమలుచేసిన ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసంధానం, ఓటీపీ విధానం అనేక ఇబ్బందులకు కారణమైందని మంత్రి గంగుల తెలిపారు. ఈ నిబంధన లేకపోతే ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యేవన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయ్యాలంటే కచ్చితంగా రైతు ఫోన్ నంబర్, ఆధార్‌కు అనుసంధానం కావాల్సిందేనని, ఆతని ఫోన్‌కు ఓటీపీ రావాల్సిందేనని తెలిపారు. మరోవైపు బియ్యం తీసుకోకుండా ఎఫ్‌సీఐ ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన నిలిచి కొట్లాడుతామని మంత్రి స్పష్టం చేశారు.
స్వప్న ఉన్నత చదువుకు సహకరిస్తా: మంత్రి గంగుల
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థిని ఉన్నతచదువుకు సహకరిస్తానని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మల్లారెడ్డి గూడకు చెందిన స్వప్న బీఎస్సీ కెమిస్ట్రీలో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఓయూ టాపర్‌గా నిలిచింది. ఉన్నవిద్య కోసం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లాలని నిశ్చయించుకుంది. అందుకు సహకారం అందించాలని కోరుతూ సోమవారం మంత్రి గంగులను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేసింది. స్వప్నను అభినందించిన మంత్రి ఆమె ఉన్నత చదువులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.