అసలే గన్నీ బ్యాగుల్లేవు. హమాలీలు దొరుకుతలేరు. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని తూకానికి పెట్టేటోళ్లు లేరు. కాంటా పెట్టిన వడ్లను లారీల్లోకి ఎత్తేటోడు లేడు. ఎత్తిన లోడును దించేటోడు లేడు. నెలల తరబడి రైతులు మార్కెట్లలోనే పడిగాపులు పడుతున్నరు. ఆడనే ఉంటున్నరు, పంటున్నరు. ఆ గోసకు తోడు వాన మోపైంది.
పులిమీద పుట్రలా రైతుపై సర్కార్ మరో పిడుగు వేసింది. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కుదించుకున్నది. ఏకంగా 15 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసే బాధ్యతను తగ్గించుకున్నది. అంటే మొదట నిర్ణయించిన లక్ష్యంలో దాదాపు 16శాతం.. ఇక కొనబోదు! మిగిలినదైనా ఈ ప్రభుత్వం కొంటదా? అదీ అనుమానమే!
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోతపెట్టింది. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్.. ఇప్పుడు 75 లక్షల టన్నులకు కుదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు లక్ష్యాన్ని సవరించింది. ఒక్కదెబ్బతో 15 లక్షల టన్నులకు కోతపెట్టింది. ఈ 75 లక్షల టన్నులనైనా రైతుల నుంచి కొనుగోలు చేస్తుందా? అంటే అదీ అనుమానంగానే ఉన్నది.
సర్కార్ లెక్కల ప్రకారం ఇప్పుటివరకు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల టన్నులే. కానీ గురువారం నమస్తే తెలంగాణ క్షేత్రస్థాయి విజిట్‌లో తేలింది 41 లక్షల టన్నులే కావడం గమనార్హం. మరో 10 రోజుల్లో కొనుగోలుకు ముగింపు పలికే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇంకా మహా అయితే మరో 10-15 లక్షల టన్నులు కొనుగోలు చేస్తుంది. ఈ లెక్కన 56-60 లక్షల టన్నుల సేకరణతో కొనుగోలుకు ముగింపు పలికే అవకాశం ఉన్నది. ముందు 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామన్న సర్కార్.. 75 లక్షల టన్నులకు కుదించి.. చివరికి 60 లక్షల టన్నులకు పరిమితం చేసి రైతులను నిండా ముంచే భారీ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోజువారీ సివిల్ సైప్లె కొనుగోలు నివేదిక ప్రకారం.. ఈ సీజన్లో 75.68 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇందులో ఇప్పటివరకు 54 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రాగా, మరో 21 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే 44 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఇంకా 31 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నివేదికలో లెక్కలేసింది. తగ్గించిన లక్ష్యంతో పోల్చినప్పటికీ సర్కార్ కేవలం 58శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా 42 శాతం కొనుగోలు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం సర్కార్ కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించడంపై రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. తీవ్రమైన జాప్యం చేస్తుండటంతో ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ నిర్దేశించుకున్న లక్ష్యంలో ప్రభుత్వం ఎంతమేరకు కొనుగోలు చేసిందనే వాస్తవాలను మాత్రం వెల్లడించడంలేదు. ఆ వివరాలు వెల్లడిస్తే సర్కార్ డొల్లతనం బట్టబయలవుతుంది. వాస్తవానికి ఇప్పటివరకు ప్రభుత్వం సగం ధాన్యమే కొనుగోలు చేసింది.
ఈ యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇందులో 90 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని తొలుత స్వయంగా సివిల్‌సైప్లె శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కొనుగోలు ప్రారంభమై నెలన్నర దాటింది. ఇప్పటివరకు సర్కార్ 45 లక్షల టన్నుల ధాన్యమే కొనుగోలు చేసింది. నిర్దేశించుకున్న లక్ష్యంలో కొనుగోలు చేసింది 50శాతమే కావడం గమనార్హం. ఇంకా 50శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉరంరది. మరోవైపు ఇంకో వారం, పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియను ముగించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ రోజుల్లో మిగిలిన 50శాతం ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఓవైపు కొనుగోలులో నిర్లక్ష్యం, సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం, కొనుగోలు లక్ష్యం తగ్గింపు వీటన్నింటినీ గమనిస్తే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా ధాన్యం ఉండగానే ముగింపు తేదీలను ప్రకటిస్తుండటం సర్కార్ కుట్రకు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
ఎంతో కొంత కొనుగోలు చేసి చేతులెత్తేయాలనే కుట్ర చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే లక్ష్యాన్ని 90 లక్షల నుంచి 75 లక్షలకు తగ్గించిందని, దానిలోనూ ఇంకా కోతపెట్టాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం 45 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఇంకో 20 లక్షల టన్నులు కొనుగోలు చేసి ప్రక్రియను ముగించే కుట్రలకు ప్లాన్ చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో విజిట్ చేసింది. ఈ విజిట్‌లో రైతలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు నమస్తే తెలంగాణ దృష్టికొచ్చాయి. ముఖ్యంగా కొనుగోలులో సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓవైపు ప్రభుత్వం 45 లక్షల టన్నులు కొనుగోలు చేశామని చెప్తున్నా.. నమస్తే తెలంగాణ క్షేత్రస్థాయి పర్యటనలో ఇది 41 లక్షల టన్నులేనని తేలడం గమనార్హం. కొందరు రైతులు తాము ధాన్యాన్ని తీసుకొచ్చి నెలరోజులవుతున్నా.. కాంటా పెట్టడం లేదని, కొనుగోలు చేయడంలేదని నమస్తే తెలంగాణతో తమ గోడు వెల్లబోసుకొన్నారు.
గన్నీలు ఇవ్వడంలేదని, లారీలను పంపడం దలేదని వాపోయారు. సర్కార్ నిర్లక్ష్యంతో వడ్లు కాంటా కాకపోవడంతో ఎండలకు తాళలేక అనారోగ్యంబారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్నిరోజులైనా సమస్యలు పరిష్కరించడంలేదంటే సర్కార్ మనుసులో ఏదో దురుద్దేశం ఉన్నదనే అనుమానాన్ని రైతులు వ్యక్తంచేశారు. గడిచిన పదేండ్లలో ఎన్నడూ ఇంతటి కష్టం పడలేదని చెప్పుకొచ్చారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె.. ఇప్పడు అన్నీ కష్టాలే.. నష్టాలే’ అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ పాలన విధానాలు, కొనుగోలు ప్రక్రియను అంతటా రైతులు గుర్తుచేసుకోవడం గమనార్హం.
తొలి లక్ష్యం: 90 లక్షల టన్నులు 90 లక్షల టన్నుల సేకరణకు రూ.23 వేల కోట్లతో మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. -మే 13న మంత్రి ఉత్తమ్
మలి లక్ష్యం: 75 లక్షల టన్నులు వచ్చిన వడ్లలో 80% ఇప్పటికే కొన్నం. మొత్తం 46 లక్షల టన్నుల ధ్యాన్యాన్ని సేకరించాం -మే 21న మీడియాతో సీఎం రేవంత్
90 లక్షల టన్నుల్లో 80%అంటే 72 లక్షల టన్నులు
75 లక్షల టన్నుల్లో 80% అంటే 60 లక్షల టన్నులు
సీఎం మాటల్లోనే కొన్నామన్నది: 46 లక్షల టన్నులు మరి అది 80 శాతం ఎలా అవుతుంది?


