మనోహరాబాద్, మే 23 : కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. అమ్ముకోవడానికీ పడరానిపాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించేందుకు 44వ జాతీయ రహదారిపైకి వెళ్తుండగా అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.
నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ పట్టువిడవకుండా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం వంటేరు ప్రతాప్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కడిక్కడే నిలిచిపోయిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసి వారాలు గడుస్తున్నా రైతులకు అందడం లేదని ఆరోపించారు. వర్ష్షాకాలం సమీపిస్తుండటంతో వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు ఫోన్‌చేసి కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.