హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ) : ‘ఉత్తమ’ అధికారుల అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమేననే విషయం ధాన్యం వేలం ప్రక్రియలో నిరూపితమైంది. గడువులోగా ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు ఉండనే ఉండవు.. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు అడగడమే ఆలస్యమనేలా గడువుపై గడువు పొడిగిస్తారు. సర్కారుకు వేల కోట్ల నష్టమొచ్చినా సరే.. సదరు బిడ్డర్లపై మాత్రం ఈగ వాలనివ్వడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన గడువు సైతం 10 రోజుల క్రితం ముగిసింది. అయినా లక్షలాది టన్నుల ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతున్నది. ధాన్యం ఎత్తడానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సైతం బేఖాతరు చేయడం గమనార్హం. 2022-23 యాసంగికి సంబంధించిన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని కాంగ్రెస్ సర్కారు గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించింది. ఇందుకు సంబంధించి 2024 ఫిబ్రవరి 23న ధాన్యం దక్కించుకున్న బిడ్డర్లకు అధికారికంగా తెలిపింది. ధాన్యం ఎత్తేందుకు 90 రోజుల గడువు ఇచ్చింది. అంటే 2024 మే 23వ తేదీతో ఆ గడువు కూడా ముగిసింది. కానీ బిడ్డర్లు 3 లక్షల టన్నులకు మించి ధాన్యం ఎత్తలేదు. ఈ గడువును మరో నాలుగు నెలలు అంటే 2024 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయినా బిడ్డర్లు ధాన్యం ఎత్తలేదు. దీంతో మూడోసారి మరో మూడు నెలలు అంటే 2024 డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది.
వేలం ధాన్యం ఎత్తేందుకు ప్రభుత్వం బిడ్డర్లకు 16 నెలల గడువు ఇచ్చింది. అయినా బిడ్డర్లు 50 శాతం ధాన్యం కూడా ఎత్తకపోవడం గమనార్హం. మొత్తం 38 లక్షల టన్నుల ధాన్యంలో ఇప్పటివరకు 18.97 లక్షల టన్నులు మాత్రమే ఎత్తినట్టు తెలిసింది. అంటే ఇంకా 19.03 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతుండటం గమనార్హం. 16 నెలల్లో బిడ్డర్లు ఎత్తింది కేవలం 49.92 శాతం ధాన్యం మాత్రమే.
వేలంలో క్వింటా ధాన్యం ధర సగటున రూ.2 వేలు పలికింది. ఈ లెక్కన 38 లక్షల టన్నుల ధాన్యం విలువ రూ.7,600 కోట్ల వరకు ఉంటుంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం అంతకుముందు బ్యాంకుల నుంచి సుమారు 12 శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రైతుల నుంచి సేకరించింది. వేలం ద్వారా ధాన్యం విక్రయించి ఆ రుణాన్ని చెల్లించాలి. కానీ వేలం ద్వారా ధాన్యం దక్కించుకున్న బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడం, నగదు చెల్లించకపోవడంతో పౌరసరఫరాల సంస్థ తీసుకొచ్చిన రుణం అలాగే ఉండిపోయింది. ప్రతినెలా రూ.90 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నట్టుగా తెలిసింది.
వేలంలో ధాన్యం దక్కించుకున్న మిల్లర్లు ధాన్యం ఎత్తేందుకు ససేమిరా అంటున్నట్టుగా మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ధాన్యానికి బదులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ‘మేం రూ.2 వేలకు ధర వేసినం. ఇతర ఖర్చులు కలిపి క్వింటాకు రూ.2300 చొప్పున ఇవ్వండి’ అంటూ మిల్లర్లకు అల్టిమేటం జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మిల్లర్లపై పలువురు పెద్దలు కూడా ఒత్తిడి పెంచినట్టు తెలిసింది.
బిడ్డర్ల వెనుక పెద్దలు ఉన్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘ఉత్తమ పెద్దలతో’పా టు ఓ ‘వ్యూహకర్త’ పాత్రపై గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు వ్యూహకర్త ధాన్యం ‘కొనుగోలు’ వ్యవహారాన్ని చక్కదిద్దినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బిడ్డర్లకు, ఢిల్లీకి మధ్య అన్ని వ్యవహారాలను చక్కదిద్దినట్టు తెలిసింది. అందుకే వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాటలా సాగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం వేలానికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఢిల్లీకి ముడుపులు ముట్టాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. బిడ్డర్లపై ప్రభుత్వ ఉదాసీనత, పలుమార్లు గడువు పెంపు, ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.