రామగిరి, మే 23: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా గురువారం సాయంత్రం నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో ప్రచారం చేయడానికి వెళ్లిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నాయకులను నిరుద్యోగులు అడ్డుకున్నారు. గ్రంథాలయంలో ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని ఆలోచించామని, అమ్మానాన్న, అవ్వాతాతల కాళ్లు పట్టుకొని ఓట్లు వేయించామని చెప్పారు. అందరం కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉద్యోగాల ఊసే లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తే నోటిఫికేషన్లు వేయడానికి అవకాశం ఉండదని తెలిసి కూడా జాప్యం చేస్తూ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.