హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 68.65 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73 శాతం కంటే ఎనిమిది శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఉదయం నుంచే మహిళా ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ పార్టీ నాయకులు అనేక చోట్ల ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు బహిరంగంగానే పంపిణీ చేశారు. అయినా, కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
నకిరేకల్, పాలేరు సహా అనేక నియోజకవర్గాల్లో ఇలా డబ్బులు పంపిణీ చేసే వీడియోలు బయటికి వచ్చినా వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినా.. కొందరు క్యూలైన్లలో ఉండటంతో వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఓటింగ్ శాతం కొద్దిగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూన్ ఐదోతేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లన్నింటినీ కలిపి బండళ్లుగా కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. గెలిచే అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 50 శాతం+1 రావాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యంలో కావాల్సిన ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యం ఓట్లను, ఎలిమినేషన్ విధానాన్ని తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ప్రారంభిస్తారు.