హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లలోని లోపాలపై విచారణ జరపాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ను కోరుతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి ఎన్డీఎస్ఏనే అత్యత్తమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిచ్చాపాటి మాట్లాడారు.
మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రప్రథమంగా పోలీసు స్టేషన్లో అధికారులు చేసిన ఫిర్యాదు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలని ఎన్డీఎస్ఏను కోరుతామని చెప్పారు. మేడిగడ్డ పరిస్థితి ఏమిటన్నది చెప్పడానికి తామేమీ ఇంజినీరింగ్ నిపుణులం కాదని అన్నారు. పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏమీ లేకుండానే రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై సభలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, అది ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదని అన్నారు.