హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా?’ అని నిలదీశారు. ‘కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో.. తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం’ అని స్పష్టంచేశారు. అసెంబ్లీలో మీడియా హాలులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ శాసన సభా సంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని, నియమ నిబంధనలు, సభా మర్యాదలు, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రజా సమస్యలపై సూటిగా సమాధానం చెప్పకుండా తొండలు, కండల భాష వాడారని, రేవంత్‌రెడ్డి ప్రవర్తించిన తీరు సభానాయకుడి హోదాకు తగినది కాదని చురకలంటించారు. సభలో సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన తొండలు, కండల భాష గురించి ఎథిక్స్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు దిశానిర్దేశం లేకుండా, తూతూమంత్రంగా ముగిశాయని విమర్శించారు. ప్రజలు ఎదురొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిసషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక అంశంపైనా ప్రభుత్వం చర్చకు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, కానీ ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఎత్తివేసిందని హరీశ్‌రావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, ఆర్థికమంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవని, సభ జరిగిన సగం రోజులు ప్రశ్నోత్తరాలు నడుపలేదని మండిపడ్డారు. ఏ ఒకరోజు కూడా అసెంబ్లీని సమయానికి ప్రారంభించలేదని తెలిపారు. ‘అసెంబ్లీలో టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట ఉంటది. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని ఏకంగా 4 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నారని 3 గంటలపాటు సభను వెయిట్ చేయించారు. ఇదేనా సభ నడిపే విధానం? ఎక్కడా సమన్వయం లేదు. ప్రిపరేషన్ ఇంట్లో చేసుకోవాలి కానీ సభకు వచ్చాక చేస్తారా? కావాలనే లేట్ నైట్ వరకు సభ నడిపి, సభ్యులు లేకుండా చేయాలని చూశారు’ అని నిప్పులు చెరిగారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఒక దిశానిర్దేశం లేకుండా, తూతూమంత్రంగా ముగిసినయ్. ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తది, ప్రజా సమస్యలకు పరిషారం దొరుకుతదని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిల్చింది. బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే సమావేశాలు నిర్వహించిండ్రు.
-హరీశ్‌రావు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలు సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని హరీశ్ విమర్శించారు. అవినీతి నుంచి మంత్రిని కాపాడటానికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేసి, ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు. రెండున్నరేండ్లలో ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలేనని కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందని తెలిపారు. ‘నిరుద్యోగుల ఆకాంక్షను సభలో గట్టిగా వినిపించాం. బీసీ కార్పొరేషన్‌కు పైసా కూడా ఖర్చు చేయలేదని రుజువు చేశాం. బీసీల గొంతుకగా బీఆర్ఎస్ పోరాడింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై కూడా స్పష్టంగా బహిర్గతం చేశాం. రెండున్నరేండ్లలో దళితులకు రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వ వైనాన్ని సభా సాక్షిగా ఎండగట్టాం.
దళితులపై రేవంత్‌రెడ్డిది కపట ప్రేమ మాత్రమే. కాంగ్రెస్ సభ్యులు సభలో కత్తుల కోలాటం ఆడుతాం, తలలు తీస్తాం, సామాజిక బహిషరణ చేస్తాం. అని పహిల్వాన్ల భాష మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి పకన కూర్చొని ప్రోత్సహించారు. ఈ వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయరు? రేవంత్‌రెడ్డి రెండేండ్లుగా సభలో మాట్లాడుతున్న భాష కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్లాల్సిందే’ అని డిమాండ్ చేశారు. ‘అసెంబ్లీలో మా గొంతు మీరు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో, అన్ని వేదికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీస్తాం. కేసీఆర్ ఆదేశాల మేరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు విజయుడు, బండారి లక్ష్మారెడ్డి, డాక్టర్ సంజయ్, కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు.