హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. 2024-25 బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి సంబంధించి గురువారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్‌పీఆర్, వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత, జౌళి, ఉద్యానవనశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తులు సృష్టించి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచేందుకు అధికారులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. 2014 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన భూముల వివరాలు, గత పదేండ్లలో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూముల వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. గత పదేండ్లలో కేంద్రం తెలంగాణకు 1.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు ఇచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తయారుచేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు.
నకిలీ విత్తనాలు మారెట్లోకి రాకుండా పూర్తిగా అరికట్టాలని, విత్తన తయారీలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కంపెనీలపై ఉకుపాదం మోపాలని అధికారులను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థులకు అందించే యూనిఫాం వస్త్ర తయారీ గురించి ఆరా తీశారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐఆండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.