వరంగల్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కాశీబుగ్గ: వరంగల్‌లోని ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై కార్మికులు ఉద్యమబాట పట్టారు. 75 ఏండ్లుగా తమ కోసం ఉన్న భవనాన్ని కూలగొట్టి మంత్రి భర్త అండతో ఒక వ్యాపారికి కట్టబెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్మికుల స్థలం వారికే చెందాలనే డిమాండ్‌తో పోరాటానికి సిద్ధమవుతున్న కార్మిక సంఘాల నేతలు మంగళవారం వరంగల్‌లో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆజంజాహి మిల్లు కార్మిక భవనాన్ని కూల్చివేసి, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టడంపై సీపీఎం, ఎంసీపీఐ, సీపీఐ-ఎంఎల్, బీజేపీ నేతలు ఆ స్థలం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. భవనాన్ని ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం సరికాదని ఆల్ ట్రేడర్స్ యూనియన్స్ నాయకులు మండిపడ్డారు. యూనియన్ భవనం కబ్జా చేసి నిర్మించే వాణిజ్య భవన నిర్మాణాన్ని సాగనివ్వబోమని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హెచ్చరించారు.