కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఫిబ్రవరి 28 : బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో ఓ కరాటే మాస్టర్ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు.
అతడికి సంబంధించి రూ.30 వేల బిల్లు ప్రభుత్వం నుంచి మంజూరైంది. ఆ బిల్లును సదరు కరాటే మాస్టర్‌కు చెల్లించకుండా పాఠశాల హెచ్ఎం తాటి రవీందర్ ఇబ్బందులకు గురిచేయడంతోపాటు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. శుక్రవారం పాఠశాలలో కరాటే మాస్టర్ నుంచి హెచ్ఎం రవీందర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.