గోపాల్పేట, జనవరి 27 : హాస్టల్ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటస్వామి అరుణ పెద్ద కుమారుడు భరత్ (13) గోపాల్పేట ఎస్సీ బాలుర ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం హాస్టల్లో భరత్ స్టడీ అవర్‌లో విద్యార్థులతో కలిసి చదువు కుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
రెండేండ్ల కిందట భరత్ తండ్రి వెంకటస్వామి ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఇప్పుడు భరత్ మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బీఆర్‌ఎస్వీతోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు దవాఖాన వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు. భరత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి మృతి ఘటనపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విద్యార్థి భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గోపాల్పేట హాస్టల్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.