Contractors License | విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టర్లుగా పని చేస్తున్న గుత్తేదారులకు లెసెన్సుల గడువును ఐదేళ్లకు ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అటు ఎన్పీడీసీఎల్ ఇటు ఎస్పీడీసీఎల్ కాంటాక్టులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వెసులుబాటు కలిగించినట్లయ్యింది. లైసెన్స్ రుసుము సైతం భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం ఈ నెల తొమ్మిది నుంచి అమలులోకి రానున్నది. తెలంగాణా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సుదీర్ఘకాలంగా విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకు వచ్చి లైసెన్స్ గడువును ఐదు సంవత్సరాలకు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేయించారు.
రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ట్రాన్స్‌కో, జెన్కో
సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సమావేశమైన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎస్ఎస్ఆర్ రేట్లను
పెంచుకోవడంతో పాటు విద్యుత్ లైసెన్సింగ్ బోర్డులో ఇద్దరు సభ్యులుగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్
అసోసియేషన్ సభ్యులను నియమించిన విషయం విదితమే.
సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, మాజిద్ అహ్మద్ లైసెన్స్ గడువు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రి ముందుంచారు. అందుకు అనుగుణంగా స్పందించిన మంత్రి యావత్ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 9న జీవో 22 జారీ చేశారు. హామీని నిలబెట్టుకున్న మంత్రికి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, లైసెన్సింగ్ బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేని విధంగా లైసెన్స్ గడువును ఐదు సంవత్సరాలకు పెంచడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.