హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డులను రద్దు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జూన్‌లో పంపిణీ చేసిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని తీసుకోని 7.24 లక్షల లబ్ధిదారులను తొలగించేందుకు యత్నిస్తున్నదని శనివారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మొండిచెయ్యి చూపుతున్నదని విమర్శించారు.
ఢిల్లీ పాలకులు దిగొచ్చేలా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 17న రైల్‌రోకో నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. శనివారం భీం ఆర్మీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆయాజ్ ఆధ్వర్యంలో కవితను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి పౌర సమాజం కలిసిరావాలని పిలుపునిచ్చారు.