హైదరాబాద్, మార్చి 6 ( నమస్తే తెలంగాణ ) : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే స్పష్టమైన సంకేతాలున్నా పనులు మొదలు పెట్టి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను రేవంత్ సర్కార్ బలిగొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ, కేవలం కమీషన్ల కోసమే పనులు చేసిందని విమర్శించారు. ఎనిమిది మంది మృతికి, రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా కావడానికి రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గం బాధ్యత వహించాలని, ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టన్నెల్ పనులు చేస్తున్న జైప్రకాశ్ అసోసియేట్స్ 2020లో అంబర్గ్టెక్ ఏజీ అనే సంస్థతో టన్నెల్ ప్రాంతంలో సర్వే నిర్వహించినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. టన్నెల్ సిస్మిక్ ప్రిడిక్షన్ (టీఎస్పీ) సర్వే చేసి ఆ ప్రమాదాన్ని 2022లోనే అంబర్గ్టెక్ ఏజీ ఊహించి హెచ్చరించిందని వివరించారు.
టన్నెల్‌లోని 13.88 కిలోమీటర్ వద్ద నుంచి 13.91 కిలోమీటర్ మధ్య ఫాల్ట్‌జోన్ ఉన్నదని స్పష్టంగా చెప్పారని, ఆ ప్రాంతంలోని రాళ్లు ధృడంగా లేకపోవడంతోపాటు నీటి లీకేజీలు భారీగా ఉన్న విషయాన్ని హైలెట్ చేశారని తెలిపారు. ఆ నివేదికలో పేర్కొన్నట్టుగానే ప్రమాదం ఫాల్ట్జోన్లోనే జరిగిందని పేర్కొన్నారు. 2022లోనే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ మండపల్లి రాజు, జైప్రకాశ్ అసోసియేట్స్ భూగర్భ శాస్త్రవేత్త రితురాజ్ దేశ్‌ముఖ్ చేసిన మరో సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. టన్నెల్ ఉపరితలాన్ని సరిగా అంచనా వేయకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించిన ఆ నివేదికలను రేవంత్ ప్రభుత్వం దాచి పెట్టి కార్మికులతో పనులు చేయించిందని మండిపడ్డారు. ఆ నివేదికలను బయటపెట్టకపోవటమే కా కుండా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ నివేదికలను బయటపెట్టడంతోపాటు ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర జరిపించాలని డిమాండ్ చేశారు.