హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు. అంతకు ముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ మట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడమే మనం రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉందని తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం జీసీసీల్లో 20 శాతం రాష్ర్టానికే వస్తున్నట్టు వివరించారు. తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ర్టాన్ని మూడు ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించిందని మూడు కీలక రంగాలకు ప్రత్యేకమైన 3 జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్రస్థాయి మార్చ్ఫాస్ట్ ట్రోఫీని దక్కించుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బీసీ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు, విద్యార్థులు సోమవారం అవార్డును అందుకున్నారు.