యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి నూతనాలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగడించ బోతుందని తెలిపారు. దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆమె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయ ముఖ మండపంలో ఆమెకు ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. అంతకుముందు ఆమె యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుభిక్షం, సంతోషంగా ఉండాలని యాదాద్రీశుడిని వేడుకున్నట్టు తెలిపారు. అన్ని రంగాలు, వర్గాలకు న్యాయం చేకూరే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్నారు. గవర్నర్ వెంట కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లంథిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు ఉన్నారు.