వరంగల్/ములుగు, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందుండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్తుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరంగల్ చారిత్రక, వారసత్వ నగరమని, కాకతీయ రాజుల సామ్రాజ్య నగరం గా వరంగల్‌కు ఘనమైన చరిత్ర ఉన్నదని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నగరంలో పర్యటించారు. ములుగు జిల్లా లక్నవరం నుంచి ఉదయం రోడ్డు మార్గంలో వరంగల్ నిట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
చారిత్రక, వారసత్వ సంపద కలిగిన వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వరంగల్‌లో వందల ఏండ్ల నాటి వారసత్వ కట్టడాలు అద్భతంగా ఉన్నాయని, కాకతీయుల కాలంనాటి శిల్ప సంపద అపూర్వమని, నాటి కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని పేర్కొన్నారు. రామప్ప, వేయి స్తంభాల దేవాలయం వంటి ఎన్నో అత్భుత కట్టడాలను చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని చెప్పారు. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ప్రధాన అర్చకుకుడు గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భద్రకాళీ అలయానికి వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఖిలావరంగల్‌లోని కాకతీయుల రాజధానిగా ఉన్న చారిత్రక ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ కాకతీయ రాజుల కాలం నాటి శిల్ప సంపదను, కట్టడాలను తిలకించారు. పురవస్తు శాఖ అధికారులు అక్కడి కట్టడాల గురించి గవర్నర్‌కు వివరించారు. కవులు, రచయితలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాలలో అవార్డులు పోందిన 40 మందితో గవర్నర్ చర్చా గోష్టి నిర్వహించారు. అనంతరం వారితో కలిసి గవర్నర్ భోజనం చేశారు. హనుమకొండలోని రెడ్‌క్రాస్ సంస్థ భవనాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. అక్కడ తలసేమియా బాధిత పిల్లలను పరామర్శించారు. కొత్తగా నిర్మించిన రెడ్‌క్రాస్ సంస్థ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసన మండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాశ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం పాల్గొన్నారు.
బుధవారం ఉదయం మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో కలిసి లక్నవరం సరస్సులో గవర్నర్ స్పీడ్ బోటు షికారు చేశారు. ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గవర్నర్ పర్యటనకు సహకరించిన కలెక్టర్, పోలీసులు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తిరుగు ప్రయాణంలో గవర్నర్ ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాను సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విషపురుగు కాటుకు గురైన కానిస్టేబుల్‌ను పరామర్శించారు.